నేల తల్లిని నమ్ముకుని బతికే రైతు చనిపోతే ఒకప్పుడు ఆ కుటుంబం దిక్కూమొక్కు లేనిదయ్యేది. ఇతర కారణాలను పక్కన పెడితే, వ్యవసాయంలో అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్నా పరిహారం చెల్లింపు ఊసే ఉండేది కాదు. పైగా నాటి పాలకుల బాధ్యత లేని ధోరణి, అపహాస్యపు మాటలు బాధిత కుటుంబాన్ని మరింత కుంగదీసేవి. తెలంగాణ రాష్ట్రంలో రైతు కుటుంబాల్లో అలాంటి పరిస్థితి ఉండొద్దని సీఎం కేసీఆర్ 2018 ఆగస్టులో రైతు బీమా పథకాన్ని ప్రారంభించారు. రైతు బీమా వేల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నది. రైతు ఏ కారణంతో మరణించినా పది రోజుల్లో నామినీ ఖాతాలో రూ. 5లక్షలు జమ చేస్తున్నది. బాధిత కుటుంబాలకు రైతు బీమా ధైర్యాన్ని ఇస్తున్నది. రైతు బీమా పథకం ప్రారంభించి నేటికి ఐదేండ్లు పూర్తవుతుండగా కర్షకులు సంతోషం వ్యక్తం చేశారు.
– సిద్దిపేట, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
సిద్దిపేట, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సీఎం కేసీఆర్ వేసే ప్రతి అడుగు రైతు సంక్షేమం కోసమే. రైతు బంధు, పంట రుణాల మాఫీతోపాటు రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. నాడు రైతు మరణిస్తే వారి కుటుంబాలు రోడ్డున పడే దుస్థితి ఉండేది. నేడు రైతు కుటుంబాలకు భరోసా కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం రైతుబీమా పథకాన్ని నిరాటంకంగా అమలుచేస్తున్నది. రైతు బీమా పథకం ప్రారంభించి నేటికీ ఐదేండ్లు పూర్తవుతున్నది. రైతు ఏ కారణంతోనైనా మృతిచెందితే ఆ కుటుంబానికి రైతు బీమా పథకం కింద రూ.5లక్షలు నేరుగా నామిని ఖాతాలో జమ చేస్తున్నారు. 2018 ఆగస్టులో రైతు బీమా పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. రైతు పేరిట భూమి ఉండి, పట్టా పుస్తకం ఉండి, 18 నుంచి 59 ఏండ్లలోపు వారికి రైతు బీమా పథకం వర్తిస్తుంది. ఒక్కో రైతు పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియాన్ని రూ.3,829 చెల్లిస్తున్నది. ఇప్పటివరకు వివిధ కారణాలతో మరణించిన రైతు కుటుంబాలకు సిద్దిపేట జిల్లాలో 4,752 మంది రైతు కుటుంబాలకు రూ.237.60 కోట్లు, మెదక్లో 4734 కుటుంబాలకు రూ.236.70 కోట్లు, సంగారెడ్డిలో 6,575 కుటుంబాలకు రూ.328.75 కోట్లు నేరుగా రైతు నామిని ఖాతాలో జమ చేశారు.
రైతు కుటుంబాలకు ధైర్యమిచ్చిన రైతు బీమా
సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో సన్న, చిన్న కారు రైతులే అధికంగా ఉన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో ప్రతి రైతుకు బీమా ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించి వారి కుటుంబానికి భరోసానిచ్చింది. రైతులకు సంబంధించిన ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేలా ఎల్ఐసీతో ఒప్పందం చేసుకున్నది. రైతు మరణించిన వారం రోజుల్లోనే నేరుగా బాధిత కుటుంబానికి బీమా డబ్బులు అందేలా ప్రత్యేకంగా చొరవ తీసుకుంటున్నది. నేరుగా రైతు నామినీ ఖాతాలో జమ చేస్తున్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాలకు భరోసాగా రైతు బీమా పథకం నిలుస్తున్నది. రైతులు తమ పొలాలకు వెళ్లినప్పుడు అనుకోని ఘటనలు జరిగి మృతి చెందుతున్నారు. ఇలా రైతు మరణిస్తే ఆ కుటుంబానికి ప్రభుత్వం పరిహారంగా అందిస్తున్నది. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బీమా పథకంతో రూ.5 లక్షలు అందిస్తూ ఎన్నో కుటుంబాలకు కొండత ధీమా ఇస్తున్నది.