హుస్నాబాద్, ఆగస్టు 6: ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమం ప్రజల జీవితంలో భాగం కావాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ శివారులోని కొత్తచెరువు వద్ద జరిగిన స్వచ్ఛదనం-పచ్చదనంలో ఆయన పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనుచౌదరితో కలిసి మొక్కలు నాటి, కొత్త చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వ హించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలంద రూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
భవిష్యత్ తరాల కోసం మొక్కలు నాటి పెంచాలనే ఉన్నత లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు. ఇందులో అందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు. అపరిశుభ్రత, పర్యావరణం దెబ్బతినడంతో వింత వ్యాధులు, అంటు వ్యాధులు ప్రబలుతున్నాయని, వీటిని అరికట్టాలంటే సమిష్టిగా స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. పట్టణంలోని ఎల్లమ్మ చెరువు, కొత్త చెరువుల అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేశామన్నారు.
కొత్త చెరువు మత్తడిపై బ్రిడ్జి నిర్మించుకొని సిద్దిపేట రోడ్డు నుంచి ఆరెపల్లికి బైపాస్రోడ్డుగా మార్చుతామని చెప్పారు. ఇందుకు అధికారులు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. నియోజకవర్గంలో పలు రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని, ఇంకా ఎక్కడెక్కడ నిధులు అవసరమో ప్రజలనుంచి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే కఠిన చర్య లు తప్పవన్నారు.
మొక్కలు నాటి పెంచడం అనేది ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి అన్నారు. స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమం ప్రతి వార్డు, గ్రామంలో విధిగా నిర్వహించాలని, ఇది నిత్యం జరిగే కార్యక్రమం అని చెప్పారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, నీరు నిల్వ ఉండకుండా, చెత్తా చెదారం లేకుండా చేయడం ద్వారా మలేరియా, డెంగీలాంటి వ్యాధులను దూరం చేయవచ్చన్నారు. పరిశుభ్రమైన నీటిని మాత్రమే వినియోగించాలన్నారు.
భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచేలా పర్యావరణ పరిరక్షణ చేయాల్సిన అవసరం ఎం తైనా ఉందన్నారు. వన మహోత్సవంలో భా గంగా జిల్లాలో ఇప్పటి వరకు 20 లక్షల మొక్కలు నాటినట్లు చెప్పారు. చెత్తను సేకరించి సేంద్రియ ఎరువులుగా మార్చే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఆర్డీవో రామ్మూర్తి, మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్, వైస్‌చైర్‌పర్సన్ అయిలేని అనితారెడ్డి, కమిషనర్ మల్లికార్జున్, సింగిల్‌విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, కౌన్సిలర్లు పాల్గొన్నారు.