రామాయంపేట, ఏప్రిల్ 30 : కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కుతుందని సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు మల్లేశం, బాలమణి పేర్కొన్నారు. బుధవారం రామాయంపేటలో సీఐటీయు కార్యాలయంలో విలేకరులుతో మాట్లాడారు. మేనెల 3, 4వ తేదీలలో రామాయంపేటలో జరిగే సీఐటీయు 15వ మహాసభలను కార్మికులు విజయవంతం చేయాలన్నారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలను ఎండగడతామన్నారు. బీడీ కార్మికులను కేంద్రం నిండా ముంచుతుందని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కార్మికులను దోచి పరిశ్రమల అధిపతులకు కేంద్రం దారాదత్తం చేస్తుందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల పేరిట అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో కార్మికులకు కనీస సదుపాయాలు లేకుండా చేసిందన్నారు. సీఐటీయు మహాసభలకు 21 మండలాల నుంచి 10 సంఘాల కార్మికులు హాజరవుతారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న కార్మిక సంఘాలు మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.