సంగారెడ్డి, జులై 4 : దేశంలో కార్మికుల హక్కులను హరించే విధంగా కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి యాదగిరి (Yadagiri) డిమాండ్ చేశారు. అంతేకాదు కార్మిక చట్టాలను యథాలాపంగా అమలు చేయాలని కేంద్రానికి అల్టీమేటం ఇచ్చిన ఆయన జూలై 9న జరుగబోయే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కార్మికులను కోరారు.
శుక్రవారం పట్టణంలోని మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ.. శతాబ్ద కాలంగా కార్మికవర్గం అనేక త్యాగాలతో, పోరాటాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి.. 4 కొత్త లేబర్ కోడ్లను తీసుకొచ్చి వాటి అమలుకు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1), ఆర్టికల్ 21,24,39(డి)లకు ఈ లేబర్ కోడ్స్ విరుద్దమైనవని నిపుణులు తేల్చినప్పటికీ కేంద్రానికి కనువిప్పు కలగడంలేదని యాదగరి బీజేపీని విమర్శించారు.
సమ్మె పోస్టర్‌తో సీఐటీయూ నేతలు, కార్మికులు
కొత్త కార్మిక కోడ్లు అమల్లోకి వస్తే కార్మిక సంఘాల ఏర్పాటు కష్టతరం అవుతుందని, కార్మికుల సమిష్టి బేరసారాల శక్తి నిర్వీర్యం అవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం ఉపయోగించుకొనే సమ్మె చేసే హక్కును సైతం కోల్పోతారని యాదగిరి తెలిపారు. జూన్ 20న జరగాల్సిన సమ్మెను వాయిదా వేసిన కేంద్ర కమిటీలు జూలై 9న సమ్మెకు పిలుపునిచ్చాయని ఆయన వెల్లడించారు. కార్మికుల అధిక సంఖ్యలో తరలివచ్చి దేశవ్యాప్తంగా జరుగనున్న ఈ సమ్మెను జయప్రదం చేయాలని యాదగిరి కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు సదానందం, లక్ష్మణ్, మహేష్, సునీత, అనిత, భాగ్యలక్ష్మి, లక్ష్మి, ప్రయ, రాజు, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.