టేక్మాల్, అక్టోబర్ 26 : విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు మరువలేనివని అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా మండల కేంద్రమైన టేక్మాల్‌లో ఆదివారం 5కిలోమీటర్ల మార్నింగ్ వాక్ నిర్వహించారు. టేక్మాల్ పోలీస్ స్టేషన్ వద్ద నుంచి ప్రారంభమైన మార్నింగ్ వాక్ గ్రామంలోని ప్రధాన వీధుల మీదుగా ఎల్లంపల్లి, టేక్మాల్ చౌరస్తా(జయశంకర్ సార్ చౌరస్తా) నుంచి పోలీస్ స్టేషన్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు నివాళులు అర్పించారు.
అమరులైన పోలీసుల సేవల్ని కొనియాడారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పగలు రాత్రి తేడా లేకుండా సమాజంలో శాంతి భద్రతలను కాపాడటానికి పగలు, రాత్రి తేడా లేకుండా విధులను నిర్వర్తిస్తున్నారని, ఈ క్రమంలో ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి కూడా పోలీసులు వెనుకాడరని తెలిపారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు మనకు స్ఫూర్తినిస్తాయన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలను నాటారు. సీఐ, ఎస్సై రాజేష్ లను నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, నాయకులు కమ్మరి సిద్దయ్య, నిమ్మ రమేష్, నాయికోటి భాస్కర్, చింత రవి, రమేష్ నాయక్, సిద్దిరాములు, రాజేందర్, తదితరులు ఉన్నారు.