హుస్నాబాద్, డిసెంబర్ 23 : రాష్ర్టానికి మంత్రిగా ఉన్నప్పటికీ హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం హుస్నాబాద్‌లోని లక్ష్మీ గార్డెన్స్‌లో జరిగిన నియోజకవర్గ స్థాయి క్రిస్మస్ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై క్రైస్తవులకు కానుకలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషిచేస్తానన్నారు. హుస్నాబాద్‌లో మెడికల్ కళాశాల ఏర్పాటుకు స్థల పరిశీలన జరుగుతున్నదని, ఆర్టీవో కార్యాలయాన్ని విస్తరించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఎన్నికలకు ముందు హుస్నాబాద్‌కు మంజూరైన రూ.25కోట్ల నిధుల విషయంపై కూడా ఆరా తీస్తున్నామన్నారు. హుస్నాబాద్‌ను అన్నిరంగాల్లో ఆదర్శంగా నిలుపుతానని తెలిపారు. గౌరవెల్లి రిజర్వాయర్ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించి కాల్వల నిర్మాణం ప్రారంభిస్తామన్నారు. నియోజకవర్గ స్థాయిలో త్వరలోనే సమీక్ష సమావేశం నిర్వహించి పెండింగ్ పనులు, సమస్యలపై చర్చిస్తామని తెలిపారు. నియోజకవర్గంలోని క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, హుస్నాబాద్‌లో క్రైస్తవ కమ్యూనిటీ భవన నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన రెండు రోజులకే రెండు గ్యారెంటీలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేన్నారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్‌చేసి అందరికీ పంపిణీ చేశారు.
క్రైస్తవులు ఆనందోత్సాహాల మధ్య క్రిస్మస్ పండుగ జరుపుకోవాలని సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. కార్యక్రమంలో హనుమకొండ జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ సుధీర్‌కుమార్, ఆర్టీవో బెన్ షాలోమ్, మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకన్న, తహసీల్దార్ రవీందర్‌రెడ్డి, ఎంపీపీలు లకావత్ మానస, మాలోత్ లక్ష్మి, కొక్కుల కీర్తి, కొత్త వినీత, అనిత, స్వప్న, కౌన్సిలర్లు కొంకటి నళినీదేవి, బొల్లి కల్పన, చిత్తారి పద్మ, వల్లపు రాజు, భూక్యా సరోజన, ఎండీ అయూబ్, నియోజకవర్గంలోని ఏడు మండలాల నుంచి వచ్చిన క్రైస్తవులు, పాస్టర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ముక్కోటి ఏకాదశి సందర్భంగా హుస్నాబాద్‌లోని సీతారామచంద్రస్వామి ఆలయంతోపాటు రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు చేశారు. సతీసమేతంగా పూజా కార్యక్రమం నిర్వహించారు. ఆలయ అర్చకులు మంత్రికి పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. భగవంతుడి ఆశీర్వాదంతో ఐదేండ్లలో హుస్నాబాద్ అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రి వెల్లడించారు.