హుస్నాబాద్ టౌన్, ఏప్రిల్ 18: అప్పుల బాధతో గల్ప్‌కు వచ్చిన సార్… కాళ్లనొప్పులతో లేవలేకపోతున్న.. పనిచేయలేక పోతున్న… ఇంటికి పోతనంటే పాస్‌పోర్టు లాక్కున్నారు. నన్ను కాపాడకుంటే ఇక్కడే చచ్చిపోయేలా ఉన్న, గల్ఫ్‌లో నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు… పదిహేను రోజులుగా కష్టాలు పడుతున్న… తిందామంటే తిండిలేదంటూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన చొప్పరి లింగయ్య దుబాయిలో పడుతున్న కష్టాలను సోషల్ మీడియాలో వెల్లడించాడు.
వివరాల్లోకి వెళితే… చొప్పరి లింగయ్య, రజితలకు ఇద్దరు కుమారులు. డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకువస్తున్న లింగయ్య కరోనా సమయంలో అనారోగ్యంతో అప్పుల పాలయ్యాడు. అప్పులు తీర్చే మార్గం లేక దుబాయికి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. గతంలో మలేషియాకు వెళ్లి పని చేసి వచ్చిన లింగయ్య మరోమారు విదేశాలకు వెళ్లి పనిచేసి అప్పులు తీర్చాలని భావించి రూ.1.50 లక్షలు వెచ్చించి వీసా తీశాడు. మార్చి 8న హుస్నాబాద్ నుంచి దుబాయిలోని షార్జాకు వెళ్లాడు. అక్కడ భవన నిర్మాణ పనులు చేస్తున్న క్రమంలో లింగయ్యకు అనారోగ్య సమస్యలు మొదలయ్యాయి.
15 రోజులుగా కనీసం కూర్చొన్న చోటు నుంచి లేవలేక ఇబ్బందులు పడుతున్నాడు. కాళ్ల నొప్పులు, భుజాలు లేవక పనికి సైతం వెళ్లలేకపోతున్నాడు. అనారోగ్య సమస్యలను సోనాపూర్ పవర్ కంపెనీ వాళ్లకు వివరించి తనను పంపించాలని వేడుకున్నాడు. కానీ వాళ్లు అతడిని పంపకుండా పాస్‌పోర్టు సైతం తీసుకోవడంతో షార్జాలోని తన గదికే పరిమితమయ్యాడు. తోటివారు దయతలిస్తే తప్ప వంట చేసుకునే పరిస్థితి లేక పస్తులతో గడుపుతున్న దీనావస్థను వీడియో కాల్లో ‘నమస్తే తెలంగాణ’కు లింగయ్య వివరించాడు. తనను ఇక్కడి నుంచి కాపాడాలని, లేదంటే ఇక్కడే చచ్చిపోయేలా ఉన్నానని లింగయ్య కన్నీటి పర్యంతమవుతున్నాడు. లింగయ్యను హుస్నాబాద్‌కు రప్పించి ఆదుకోవాలని మాజీ కౌన్సిలర్ పెరుక భాగ్యారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.