సంగారెడ్డి కలెక్టరేట్, నవంబర్ 26: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రతిబింబించేలా దీక్షా దివస్ను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు బుధవారం సంగారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లాలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు.
దీక్షా దివస్ను విజయవంతం చేసేందుకు సమగ్ర ప్రణాళికను రూపొందిస్తూ అవసరమైన ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం బీఆర్ఎస్వీ నాయకుడు అఖిల్ ఆధ్వర్యంలో రూపొందించిన దీక్షా దివస్ వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. అంతకుముందు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ.. కేసీఆర్ ఆనాడు దీక్ష చేయకుంటే తెలంగాణ వచ్చేది కాదన్నారు. బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ను కనుమరుగు చేయడం ఎవరి తరం కాదని స్పష్టం చేశారు.
తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ చచ్చుడో అనే గొప్ప త్యాగనిరతితో దీక్ష చేపట్టి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన తీరును గుర్తుచేశారు. జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు, అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ రాష్ట్ర కల సాకారమైందన్నారు. సమావేశంలో డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, బీఆర్ఎస్ నాయకులు మెట్టు కుమా ర్, తొంట అంజయ్య, బాల్రాజ్, విజయేందర్ రెడ్డి, కాసాల బుచ్చిరెడ్డి, డాక్టర్ శ్రీహరి, పేరుమాండ్ల నర్సిం లు, బీఆర్ఎస్వీ నాయకులు రాజేందర్ నాయక్, అఖిల్, తదితరులు పాల్గొన్నారు.