కంది, ఫిబ్రవరి 3: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల కోడ్ పేరుతో ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలను ఆపేందుకు కుట్ర చేస్తుందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. పెండింగ్, ఫాడింగ్ చేయడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. సోమవారం సంగారెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సంగారెడ్డి, సదాశివపేట పట్టణాల అభివృద్ధికి ఎస్డీఎఫ్ నిధుల ద్వారా సంగారెడ్డి మున్సిపాలిటీకి రూ.50కోట్లు, సదాశివపేట మున్సిపాలిటీకి రూ.25 కోట్లు ముంజూరు చేసిందన్నారు.
కానీ ప్రభుత్వం మారడంతో సంగారెడ్డి పట్టణంలో 53, సదాశివపేటలో 141 పెండింగ్ పనులకు సంబంధించిన నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని మండిపడ్డారు. పట్టణాల అభివృద్ధిని అడ్డుకోకుండా రద్దు చేసిన పనులను ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. జనవరి 26 తర్వాత రైతు భరోసా డబ్బులు ఖాతాల్లో వేస్తామని మరోసారి మోసం చేసిందని, ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదన్నారు. నాలుగు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పడం తప్పా చేసిందేమీ లేదన్నారు.
సంగారెడ్డి నియోజకవర్గంలో 86 గ్రామాలుంటే కేవలం నాలుగు గ్రామాలను ఎంపిక చేసి అమలు చేయని పరిస్థితుల్లో కాంగ్రెస్ పాలన ఉందన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు అయోమయంగా ఉన్నారని, పంట రుణమాఫీపై స్పష్టత లేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పూర్తిస్థాయిలో పంట రుణమాఫీ అయ్యిందని ప్రకటనలు చేస్తుంటే, జిల్లా మంత్రి పూర్తిస్థాయిలో పంట రుణమాఫీ కాలేదని ఒప్పుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం మాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు వెంకటేశ్వర్లు, మధుసూదన్‌రెడ్డి, చక్రపాణి, ఆంజనేయులు, విఠల్ తదితరులు పాల్గొన్నారు.