సంగారెడ్డి కలెక్టరేట్, డిసెంబర్ 1: సిగాచి పేలుడు బాధితులకు ఇస్తామన్న రూ.కోటి పరిహారం ఏమైందని బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.ప్రావీణ్య, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్లకు సోమవారం వారు వేర్వేరుగా వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ సిగాచి పరిశ్రమలో ఘటన జరిగి నాలుగునెలలు గడిచినా బాధిత కుటుంబాలకు పరిహారం అందలేదని దుయ్యబట్టారు.
సిగాచి బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి సిగాచి పేలుడు బాధితులకు రూ.కోటి పరిహారం చెల్లిస్తామని చెప్పి ఇప్పుడు చేతులు దులుపుకొన్నాడని మండిపడ్డారు. పేలుడులో మృతి చెందిన బాధిత కుటుంబాలకు కంపెనీ నుంచి రూ.25 లక్షలు, ప్రభుత్వం నుంచి రూ.లక్ష మాత్రమే అందించారని గుర్తు చేశారు. రూ. కోటి పరిహారం కోసం బాధిత కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఘటనా స్థలానికి సీఎం, జిల్లా మంత్రి, సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారులు వచ్చినా ఇప్పటివరకు సమ స్య పరిష్కారం కాలేదన్నారు. సమస్య పరిష్కరించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. కేంద్రం నుంచి రూ.2 లక్షల నష్టపరిహారం కూడా ఇప్పటివరకు అందలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పరిహారం వెంటనే విడుదల చేసిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. బీఆర్ఎస్ నాయకులు గడీల శ్రీకాంత్‌గౌడ్, మోహిజ్ఖాన్, బుచ్చిరెడ్డి, వెంకటేశ్వర్లు, నర్సింహులు పాల్గొన్నారు.