కంది, జూలై 30: కంది మండల పరిధిలోని చిమ్నాపూర్ ప్రభుత్వ పాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరింది. వర్షానికి తరగతి గదులు ఉరుస్తుండటంతో ఒకే గదిలో అన్ని తరగతులు నిర్వాహించాల్సిన దుస్థితి. కురుస్తున్న వర్షాలకు పాఠశాల భవనం ఎక్కడ కూలిపోతుందోనని ఉపాధ్యాయులు, విద్యార్థులు భయబ్రాంతులకు గురువుతున్నారు. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ పాఠశాలను అధికారులు పట్టించుకోకపోవడం గమనర్హం. కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య ఘననీయంగా తగ్గింది.
చిమ్నాపూర్ ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు ఉన్న 30 మంది విద్యార్థులకు ముగ్గురు టీచర్లు ఉన్నారు. మరో రెండు కిలో మీటర్ల దూరంలో ఉన్న చిమ్నాపూర్ తండా పాఠశాల సైతం శిథిలావస్థకు చేరడంతో అక్కడున్న 10 మంది విద్యార్థులను చిమ్నాపూర్కు తరలించారు. వర్షం పడినప్పుడు పైకప్పు పెచ్చులూడడం, ఉరవడం వంటి సమస్యలు నరకయాతనగా మారాయి. ప్రధానోపాధ్యాయుడి గది, వరాండాలో పాఠాలు బోధించాల్సిన పరిస్థితి ఉంది.
పెంకుటిళ్లు మాదిరి ఉన్న హెచ్ఎం కార్యాలయ పైకప్పుకు ప్లాస్టిక్ కవర్ కప్పి పాఠాలు చెప్సాల్సిన పరిస్థితి. చిమ్నాపూర్, చిమ్నాపూర్ తండాల్లో సుమారు 1000 మంది జనాభా ఉన్నా కేవలం 30 మంది పిల్లలు మాత్రమే ఇక్కడ చదువుతున్నారు. పాఠశాలలో విద్యుత్ వైర్లన్నీ గోడలకు వెలాడుతూ దర్శనమిస్తున్నాయి. అమ్మ ఆదర్శ పాఠశాల కింద రూ.4లక్షల నిధులు మంజూరైనప్పటికీ పాఠశాల మాత్రం మరమ్మతులకు నోచుకోలేదు. ఆ నిధులు ఎమయ్యాయో తెలియని పరిస్థితి ఉంది. పిల్లలను ఈ పాఠశాలకు పంపేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు. శిథిలావస్థలో ఉన్న ఈ పాఠశాలను కూల్చివేసి నూతన భవనం నిర్మించాలని కోరుతున్నారు.
పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. వర్షాలకు తరగతి గదులన్నీ ఉరుస్తున్నాయి. గదుల్లో కూర్చోలేని పరిస్థితి ఉంది. పాఠశాలలో విద్యార్థులను చేర్పించేందకు తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదు. వీలైనంత తొందరగా కొత్తగా పాఠశాల భవనం నిర్మించాలి. విద్యార్థులకు ఆట స్థలం కూడా లేదు. క్రీడా మైదానంతో కూడిన నూతన పాఠశాల భవనం నిర్మించాలి.
– ఎండీ అఫ్జల్, చిమ్నాపూర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు