సంగారెడ్డి, నవంబర్ 27 : సంగారెడ్డి జిల్లా కేంద్రం ప్రజలు ఎదురుచూస్తున్న మెట్రోరైలు సౌకర్యం రెండు దశల్లో ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ముచ్చటగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయగానే చుక్..చుక్ రైలుకు శ్రీకారం చుట్టనున్నారని బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణంలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో బీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై ప్రజలకు త్వరలో ఏర్పడే ప్రభుత్వంలో అమలు చేసే పథకాలను ప్రకటించారు. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ.. నేను మీ ముందు నిలబడడానికి కారణం సీఎం కేసీఆర్ అని, తనకు మరోసారి అభ్యర్థిగా అవకాశం ఇవ్వడం తన అదృష్టమన్నారు.
2018 ఎన్నికల్లో తాను ఓడిపోయినా ప్రజా సేవలో ఉన్నానని, కరోనా కష్టకాలంలో బాధితులకు అవసరమైన మందులు, నిత్యావసరాలు అందజేసి ఆదుకున్నామన్నారు. గత ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సంగారెడ్డిలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తామని ప్రకటించారని తెలిపారు. ఇచ్చిన మా టకు కట్టుబడి ఏడాదిలోపే సంగారెడ్డి ప్రజలకు మెడికల్ విద్య అందించిన ఘనత సీఎంకే దక్కిందన్నారు. మెడికల్ కళాశాల తోపాటు నర్సింగ్ కళాశాల, పారామెడికల్ కళాశాలను మంజూ రు చేశారని, కళాశాలల భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. మొదటి సంవత్సరం మెడికల్ విద్య అభ్యసిస్తున్న విద్యార్థులు రెండో సంవత్సరం నాటికి భవనాల నిర్మా ణం పూర్తి కావచ్చిందన్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలోని రైతాంగానికి రెండు పంటలకు నీళ్లు అందించేందుకు సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్‌తో సస్యశ్యామలం కానున్నదని గుర్తు చేశా రు. నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తానని తనను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించాలని ప్రజలను ఆయన అభ్యర్థించారు.
ప్రజలకు అందుబాటులో ఉండి సేవకుడిలా పని చేసేందు కు తాను నిరంతరం శ్రమిస్తానని, మీరే నా బలం.. నా బలగం అనుకుని ముందుకు సాగుతానని చింతా ప్రభాకర్ అన్నారు. తాను ముఖ్యమంత్రి దృష్టికి మొదటి విడతలో మియాపూర్ నుంచి ఇస్నాపూర్ వరకు పొడిగించిన మెట్రోరైలును రెండో దశలో ఇస్నాపూర్ నుంచి సంగారెడ్డి చౌరస్తా వరకు పొడిగించాలని కోరారని. జిల్లా కేంద్రంలో ఐటీహబ్ ఏర్పాటు చేస్తే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చి ఉపాధి దొరుకుతుందని, అసలు నిరుద్యోగమే లేకుండా పోతుందని సీఎంకు వివరించా నని తెలిపారు. నియోజవర్గ అభివృద్ధికి ప్రజలు తోడుంటే తన ను గెలిపించి ఎమ్మెల్యేగా చేస్తే నిలిచిపోయిన పనులన్నీ సీఎం కృషితో అమలు చేస్తానని చింతా ప్రభాకర్ భరోసా ఇచ్చారు.
కొండాపూర్/సదాశివపేట, నవంబర్ 27 : ముఖ్యమంత్రి కేసీఆర్ సంగారెడ్డిలో సోమవారం నిర్వహించిన సంగారెడ్డి నియోజకవర్గ ప్రజా ఆశీర్వాదసభకు కొండాపూర్ మండలంలోని 24 గ్రామపంచాయతీలు, మధిర గ్రామాలు, సదాశివపేట మున్సిపాలిటీలోని 26 వార్డులు, మండలంలోని 30 గ్రామాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో తరలివెళ్లారు. కొండాపూర్, సదాశివపేట మండలాల నుంచి వచ్చిన నాయకులు చిందులేస్తూ సభాస్థలికి చేరుకున్నారు. సీఎం కేసీఆర్ జిందాబాద్, చింతా ప్రభాకర్ నాయకత్వం వర్దిల్లాలి అనే నినాదాలతో సంగారెడ్డి పట్టణం దద్దరిల్లింది. ప్రజా ఆశీర్వాద సభ ప్రాంగణం మొత్తం గులాబీమయంతో కళకళలాడింది. ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన ముచ్చట్లను ప్రజలు శ్రద్ధ్దగా విని కారు గుర్తుకు ఓటేస్తే అభివృద్ధి ఆపడం ఎవరి తరం కాదనే విషయాన్ని తెలుసుకున్నారు. గతంలో స్వల్ప ఓట్లతో ఓటమి చెందిన చింతా ప్రభాకర్ ఓడిపోయినా ప్రజల్లోనే ఉండి సమస్యలు పరిష్కరించారని ప్రజలు ముచ్చటించుకున్నారు. సభకు వెళ్లిన వారిలో లో కొండాపూర్, సదాశివపేట పట్టణ, మండలానికి చెందిన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.