పటాన్చెరు నియోజకవర్గ ప్రజలు అభివృద్ధికి పెద్దపీట వేసిన బీఆర్ఎస్కు ఓటు వేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. రాయి ఏదో, రత్నం ఏదో గుర్తుపట్టాలన్నారు. ప్రజల కోసం పనిచేసే మహిపాల్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గురువారం అమీన్పూర్ మండలం పటేల్‌గూడలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పటాన్చెరు నియోజకవర్గంలో ఐటీ పరిశ్రమలను ఏర్పాటు చేస్తామన్నారు. విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చి పెద్దసంఖ్యలో కాలుష్య రహిత పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. మియాపూర్ నుంచి ఇస్నాపూర్ వరకు మెట్రోరైల్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. నియోజకవర్గంలో 2.50 లక్షల కార్మికులకు ఇండ్ల స్థలాలు ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ప్రజల కోసం పనిచేస్తున్న, పటాన్చెరును అభివృద్ధ్ది చేసిన బీఆర్ఎస్ను గెలిపించాలన్నారు.
సంగారెడ్డి,నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): పటాన్చెరు నియోజకవర్గ ప్రజలు బేకార్గాళ్లకు ఓటువేస్తే బేకార్ అవుతారని, పటాన్చెరు నియోజకవర్గం అభివృద్ధికి పెద్దపీట వేసిన బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. రాయి ఏదో, రత్నం ఏదో గుర్తుపట్టి ప్రజలు ఓటు వేయాలని, మహిపాల్‌రెడ్డి ప్రజల మనిషని ప్రజల కోసం పనిచేసే మహిపాల్‌రెడ్డిని భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించాలన్నారు. గురువారం అమీన్పూర్ మండలం పటేల్‌గూడలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద బహిరంగసభ సక్సెస్ అయ్యింది. సభకు సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పటాన్చెరు నియోజకవర్గంలో ఐటీ పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే పటాన్చెరు నియోజకవర్గానికి విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చి పెద్దసంఖ్యలో కాలుష్య రహిత పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. మియాపూర్ నుంచి ఇస్నాపూర్ వరకు మెట్రోరైల్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ మెట్రో రైలు ఏర్పాటు చేస్తున్నామని, దీంతో పటాన్చెరు నియోజకవర్గం దశ మారుతందని తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గంలో 2.50 లక్షల కార్మికులు ఉన్నారని, కార్మికులకు ఇండ్ల స్థలాలు ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే కార్మికులకు ఇండ్ల స్థలాల అంశానికి మొదటి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఓటు వజ్రాయుధం లాంటిదని, ఎవరికిపడితే వారికి ఓటు వేస్తే మంచి ఫలితాలు రావని హెచ్చరించారు. ప్రజల కోసం పనిచేస్తున్న, పటాన్చెరు అభివృద్ధ్ది చేసిన బీఆర్ఎస్ను గెలిపించాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటుతో పటాన్చెరు భవిష్యత్తు, ప్రజల తలరాతలు మారతాయని సీఎం కేసీఆర్ అన్నారు.
కాంగ్రెస్ పాలనలో పటాన్చెరు ప్రాంతంలో నిత్యం కరెంట్ కోతలు, పవర్ హాలిడేలు ఉండేవన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ లేదు, మంచినీళ్లు లేవు, సాగునీరు లేక పటాన్చెరు ప్రాంత ప్రజలు ఇబ్బందిపడే వారని గుర్తుచేశారు. అలాంటి కాంగ్రెస్‌కు ఓటువేయవద్దని, ఓటు వేస్తే కష్టాలు వస్తాయని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ కోతల కారణంగా పారిశ్రామిక వేత్తలు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడేవారన్నారు. కాంగ్రెస్ రాజ్యంలో పటాన్చెరు పారిశ్రామిక వాడకు ఎన్నడూ కరెంట్ సక్కగా ఉండేది కాదన్నారు. కరెంట్ కోతల కారణంగా పరిశ్రమల్లోని కార్మికులు ఇబ్బంది పడేవారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పటాన్చెరు పారిశ్రామికవాడలో కరెంట్ కోతలు లేవన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా అవుతుండటంతో పరిశ్రమల్లో కార్మికులు రెండు షిప్టులు పనిచేస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నారని తెలిపారు. పరిశ్రమల్లో ఉత్పత్తి పెరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కాలుష్యం పెద్ద సమస్యగా ఉండేదన్నారు. కాలుష్యం కారణంగా ప్రజలు ఇబ్బందిపడేవారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కాలుష్యనివారణకు అనేక చర్యలు తీసుకుందన్నారు. ప్రస్తుతం కాలుష్యరహిత పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో పెద్దఎత్తున విదేశీపెట్టుబడులు తీసుకొచ్చి పటాన్చెరును కాలుష్య రహిత పరిశ్రమల కేంద్రంగా మారుస్తామని తెలిపారు.
పటాన్చెరులో మెడికల్ డివైజ్‌పార్కు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మెడికల్ డివైజ్ పార్కులో గుండె జబ్బులు ఉన్నవారికి వేసే స్టంట్లు తయారవుతున్నట్లు తెలిపారు. కంటివెలుగు అద్దాలు మెడికల్ డివైజ్పార్కులోని పరిశ్రమలు తయారు అవుతున్నట్లు వివరించారు. పటాన్చెరులో తయారైన 80వేల అద్దాలు కంటివెలుగు ద్వారా పంపిణీ చేశామన్నారు. గతంలో కంటివెలుగు అద్దాలను చైనా నుంచి తెప్పించేవారమని, ప్రస్తుతం పటాన్‌చెరులోనే కంటివెలుగు అద్దాలు తయారు అవుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పటాన్చెరు నియోజకవర్గ ప్రజలు కలుషితనీళ్లు తాగి జబ్బులు పడేవారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక మిషన్‌భగీరథతో ఇంటింటికీ శుద్ధమైన జలాలు అందజేస్తున్నట్లు చెప్పారు. పటాన్చెరు నియోజకవర్గంలోని కార్మికుల కోసం 300 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖాన ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పటాన్చెరులో ఆర్డీవో కార్యాలయం, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు చేయటంతోపాటు ఐటీఐ కాలేజీ మంజూరు చేశామని తెలిపారు. ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి కోరిన విధంగా పటాన్చెరు నియోజకవర్గంలో రహదారుల విస్తరణ, అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తామని సీఎం హామీ ఇచ్చారు.
పటాన్చెరు/రామచంద్రాపురం/అమీన్పూర్/గుమ్మడిదల/బొల్లారం, నవంబర్ 23 : సీఎం సభ సక్సెస్‌తో బీఆర్ఎస్ శ్రేణుల్లో నయాజోష్ కనిపించింది. గురువారం పటాన్చెరు పట్టణం ఎల్లంకి కాలేజీ సమీపంలోని గ్రౌండ్లో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు ప్రజలు పోటెత్తారు. సీఎం కేసీఆర్ హెలిక్యాప్టర్‌లో వచ్చి సభ చుట్టూ రౌండ్ వేయడంతో ప్రజలు గులాబీ కండువాలు తిప్పుతూ సీఎంకు ఘనంగా స్వాగతం పలికారు. సభా వేదికపైకి సీఎం చేరగానే ప్రజలు చప్పట్లు, ఈలలు, కేరింతలతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సభలో మాట్లాడుతున్నంత సేపు ప్రజలు చప్పట్లతో ఎమ్మెల్యేపై అభిమానాన్ని చాటారు. ఎమ్యెల్యే వినతిపై స్పందించిన సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే చెప్పిన ప్రతి పనినీ పూర్తి చేస్తానని హామీనిచ్చారు. తెల్లాపూర్‌లో ఐటీ హబ్‌కు త్వరలోనే అనుమతులు ఇస్తామని చెప్పడంతో యువత నుంచి మంచిస్పందన వచ్చింది. ఎమ్మెల్యే కోరిన 75 గజాల ప్లాట్లను పంపిణీ చేసేందుకు సీఎం అంగీకరించడంతో మహిళలనుంచి మంచి స్పందన వచ్చింది. అర్హులైన వ్యక్తులకు గృహలక్ష్మి పథకం ద్వారా రూ3 లక్షలు ఇస్తామని చెప్పడంతో ప్రజలు చప్పట్లతో స్వాగతించారు. నోవాపాన్ నుంచి శంకర్పల్లి వరకు డబుల్రోడ్డుతోపాటు ఇతర రోడ్లు కూడా పూర్తి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. మియాపూర్ నుంచి ఇస్నాపూర్ వరకు మెట్రోరైల్‌ను తప్పనిసరిగా వేస్తామని తెలిపారు. దీంతోపాటు రింగురోడ్డు చుట్టూ మెట్రో రైలు విస్తరించే ప్రతిపాదనను వాస్తవం చేస్తామని చెప్పారు. ఇతర రాష్ర్టాల ప్రజల సంక్షేమం మా బాధ్యత అని సీఎం చెప్పడంతో ఉత్తరాది ప్రజలు హర్షధ్వానాలతో జేజేలు పలికారు. వారి కోసం సీఎం హిందీలో సంభాషించి బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని ఇక్కడి వారిగానే చూస్తుందని హామీనిచ్చారు.
ప్రజల మధ్యే ఉంటూ ప్రజల కోసం నిరంతరం పాటుపడే ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అని సీఎం కేసీఆర్ కొనియాడారు. ప్రజల మనిషి అని ఎమ్మెల్యే పనితీరును ప్రశంసించారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నిండింది. యువత పెద్దఎత్తున హర్షధ్వానాలు చేశారు. ప్రజలతో మమేకమై ఉంటున్న నాయకుడికి ఈ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని నియోజకవర్గ ప్రజలను కోరారు. నిరంతరం ప్రజలకు సేవలందించే నాయకులకు మద్దతుగా ఉండాలని సూచించారు. కరోనా టైంలో మీతోపాటు ఉండి సేవలందించిన వ్యక్తి మహిపాల్‌రెడ్డి అని గుర్తు చేశారు. ప్రజలు ఎవరు మేలు చేస్తున్నారో, ఎవరు చెడు చేస్తున్నారో గ్రహించి ఓటువేయాలని సూచించారు. ఎమ్మెల్యేను, పటాన్చెరు అభివృద్ధిని సీఎం కేసీఆర్ ప్రశంసించడం బీఆర్ఎస్ వర్గాల్లో నూతన ఉత్తేజం నింపింది. కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, మాజీస్పీకర్ మధుసూదన్‌చారి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ భూపాల్‌రెడ్డి, గాలి అనిల్‌కుమార్, సఫాన్దేవ్, శంకర్‌యాదవ్, గడీలశ్రీకాంత్గౌడ్, యూపీ మాజీ ఎమ్మెల్యే మనోజ్‌కుమార్ ఠాకూర్, నగేశ్‌యాదవ్, సింధూఆదర్శ్‌రెడ్డి, మెట్టుకుమార్ యాదవ్, కార్మికనాయకుడు ఎల్లయ్య, మున్సిపల్ చైర్మన్లు లలితాసోమిరెడ్డి, కొలను రోజాబాల్రెడ్డి, తుమ్మల పాండురంగారెడ్డి, ఎంపీపీలు సుస్మాశ్రీవేణుగోపాల్రెడ్డి, ఈర్ల దేవానంద్, సద్ది ప్రవీణావిజయభాస్కర్‌రెడ్డి, జడ్పీ వైస్‌చైర్మన్ ప్రభాకర్, జడ్పీటీసీలు సుప్రజావెంకట్‌రెడ్డి, కుమార్‌గౌడ్, సుధాకర్‌రెడ్డి, పరమేశ్వర్ యాదవ్, అంజయ్య, ఐలేశ్, నర్సిం హ, దేవేందర్ యాదవ్,రాకేశ్,కృష్ణకాంత్, ఏఎంసీ చైర్మన్ మల్లారెడ్డి, మాజీఎంపీపీ యాదగిరియాదవ్, శ్రీశైలంయాదవ్, మెరాజ్‌ఖాన్, గూడెం యాదమ్మ, గూడెం మధుసూదన్‌రెడ్డి, విక్రమ్‌రెడ్డి, నాయకులు చంద్రారెడ్డి, మాజీ జడ్పీటీసీ బాల్‌రెడ్డి, వరప్రసాద్‌రెడ్డి, హన్మంత్‌రెడ్డి, మేడిపల్లి మురళి, మమతావేణు, ఆలేటి నవీనాశ్రీనివాస్‌రెడ్డి, ఆనంద్కిష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
పటాన్చెరులో ఉత్తరభారతానికి చెందిన ప్రజలు ఎక్కువసంఖ్యలో ఉంటారని సీఎం కేసీఆర్ అన్నారు. పటాన్చెరు మినీఇండియాగా మారినట్లు చెప్పారు. ఉత్తర భారతం నుంచి వచ్చిన కార్మికులను తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములుగా గుర్తిస్తున్నట్లు తెలిపారు. ఉత్తర భారతదేశానికి చెందిన కార్మికులకు అండగా నిలుస్తామని తెలిపారు. కరోనా సమయంలో ఉత్తరభారతం నుంచి వచ్చిన కార్మికులను ప్రత్యేక రైళ్లలో సొంత ప్రాంతాలకు పంపినట్లు గుర్తు చేశారు. ఉత్తరభారత కార్మికులకు ప్రత్యేక రైళ్లు నడుపుదామంటే ప్రధాని మోడీ అంగీకరించలేదని, దాంతో బీఆర్ఎస్ ప్రభుత్వం సొంత నిధులతో 170 ప్రత్యేక రైళ్లు నడిపి ఉత్తర భారత కార్మికులను సొంత ప్రాంతాలకు తరలించామని, రైళ్లలో వెళ్లిన కార్మికులు సీఎం కేసీఆర్ జిందాబాద్ అంటూ వెళ్లారని తెలిపారు. ఉత్తర భారత కార్మికులు, పటాన్‌చెరులోని ముస్లిం లు మహిపాల్‌రెడ్డికి ఓటువేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. బహిరంగ సభలో మాజీ ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, బీఆర్ఎస్ నాయకులు సపాన్‌దేవ్, గాలి అనిల్‌కుమార్, శ్రీకాంత్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సైడ్ లైట్స్..
u పటాన్చెరు సభా ప్రాంగణాన్ని సీఎం కేసీఆర్ హెలిక్యాప్టకర్లో చుట్టూ తిరిగి వీక్షించారు.
u సీఎం కేసీఆర్ హెలిక్యాప్టకర్లో సభావేదిక చుట్టూ చెక్కర్లు కొడుతుంటే ప్రజలు అభివాదం చేశారు.
u పటాన్చెరు సభ వద్దకు సీఎం కేసీఆర్ సాయంత్రం 5.22గంటలకు హెలిక్యాప్టర్‌లో వచ్చారు.
u సాయంత్రం 5.23గంటలకు హెలిక్యాప్టర్ నుంచి దిగారు.
u సభావేదిక పైకి 5.33గంటలకు సీఎం కేసీఆర్ వచ్చారు.
u సీఎం కేసీఆర్ సభావేదికపైకి వచ్చే ముందు జనం కేరింతలు, చప్పట్లతో స్వాగతం పలికారు.
u అభిమానులు సీఎం కేసీఆర్ రాకను వారి సెల్ఫోన్లలో వీడియోలు, ఫొటోలు తీసి సంబురపడ్డారు.
u సాయంత్రం 5.43గంటలకు సీఎం కేసీఆర్ ప్రసంగం ప్రారంభించారు.
u సీఎం కేసీఆర్ ప్రసంగం 6.05గంటలకు ముగిసింది.
u 6.08గంటలకు సీఎం కేసీఆర్ సభావేదిక దిగి ప్రగతి బస్సులో రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు వెళ్లారు.
u సీఎం కేసీఆర్ ప్రసంగం జరిగినంతవరకు జనాల నుంచి చప్పట్లు, విజిళ్లు, కేరింతలు వచ్చాయి.
u సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని ప్రజలు ఆసక్తిగా విన్నారు.
u సీఎం సభకు ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు.
u సుమారుగా సభకు 50వేల మంది వరకు హాజరయ్యారు.
u జై తెలంగాణ, జై కేసీఆర్, జై జీఎంఆర్ నినాదాలు మార్మోగాయి.