పుల్కల్, మార్చి 17 : సింగూరు ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు సాగునీరివ్వకుంటే తామే గేట్లు ఎత్తాల్సి వస్తుందని ప్రభుత్వానికి అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ హెచ్చరించారు. పుల్కల్ మండలంలోని హుమ్లా నాయక్ తండా,లక్ష్మీసాగర్ శివారులో ఎండిన వరి, మొక్క జొన్న పంటలను సోమవారం బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు జైపాల్ రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. పక్కనే సింగూరు ప్రాజెక్టులో 20 టీఎంసీల నీరున్నా సాగునీరు వదలక పోవడంతో పంటలన్నీ ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
అప్రకటిత విద్యుత్ కోతలు, తరుచూ మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతుండడం, నీళ్లులేక పంటలు ఎండిపోతుండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదని సంగారెడ్డి జిల్లా అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదని విమర్శించారు. ఎండిన పంటలను చూస్తుంటే కండ్లలో నీళ్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
సింగూరు నుంచి వానకాలం,యాసంగి రెండు పంటలకు నీళ్లు ఇవ్వలేదన్నారు. వ్యవసాయానికి నీరు ఇవ్వకుండా, సింగూరు నీటిని తాగునీటి అవసరాలకు వినియోగించుకోవడానికి ప్రభుత్వం చూస్తున్నట్లు విమర్శించారు. ప్రభుత్వం స్పందించి సింగూరు ఆయకట్టు రైతులకు నీరివ్వాలని డిమాండ్ చేశారు. ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి దామోదర రాజనర్సింహకు రైతుల బాధలు పట్టవా అని విమర్శించారు.
మరో పదిహేను రోజుల్లో పంటలన్నీ ఎండిపోయే ప్రమాదం ఉందని, ఇప్పటికైనా మంత్రి చొరవ తీసుకుని తక్షణమే కాలువల ద్వారా నీటిని విడుదల చేయించాలని డిమాండ్ చేశారు. లేకపోతే హరీశ్‌రావు, రైతులతో కలిసి సింగూరు ప్రాజెక్టును ముట్టడిస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం కోడూరులో బీరప్ప కామరాతి కల్యాణోత్సవానికి హాజరయ్యారు. కార్యక్రమంలో ఆయన వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాచర్ల విజయ్‌కుమార్, మల్లేశం నాయకులు తదతరులు ఉన్నారు.