Chanduru Lift | చిలిపిచెడ్,మార్చి 5 : మండలంలోని చండూర్ గ్రామ శివారులోని మంజీరా నది వద్ద ఉన్న ఎత్తిపోతల ప్రాజెక్టుకు మరమ్మతులు చేయాలని చండూర్, గుజిరి తండా రైతులు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డికి కలిశారు. బుధవారం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే స్వగృహంలో గుజిరి తండా తాజా మాజీ సర్పంచ్ రాకేష్‌నాయక్, చండూర్ నాయకుడు దాసరి శేషాద్రి ఆధ్వర్యంలో రైతులు చండూర్ ఎత్తిపోతల ప్రాజెక్టుకు మరమ్మతులు చేయించాలని వినతి పత్రం అందజేశారు.
చండూర్, గుజిరి తండాలో భూగర్భ జలాలు పూర్తి అడుగంటిపోయి బోర్లు నీరు పోయలేక వరి, చెరుకు, కూరగాయలు ఎండిపోతున్నాయని రైతులు ఎమ్మెల్యేకు తెలిపారు. ఎత్తిపోతల ప్రాజెక్టు 800ల ఎకరాలకు సాగుకోసం మంజూరు చేసిన ఈ ప్రాజెక్టు వివిధ కారణాల వల్ల మట్టి నిండి మోటర్లు పంపుసెట్లు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పూర్తి ధ్వంసం కావడం జరిగిందని ఎమ్మెల్యేకు తెలిపారు. చండూర్, గుజిరి తండా శివారులో భూగర్భ జలాలు పూర్తి అడుగంటిపోవడంతో రైతులు పంటలు ఎండిపోకుండా 720 ఫీట్లు వరకు బోర్లు వేసిన నీరు పడకపోవడంతో అప్పులపాలై పంటలు సాగుచేయలేకపోతున్నామని ఎమ్మెల్యే దగ్గర రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ధ్వంసం అయిన ఎత్తిపోతలను మరమ్మతులు చేయించే విధంగా అధికారులపై చర్యలు తీసుకోవాలని రైతులు ఎమ్మెల్యేను కోరారు.
దీంతో ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్,అదనపు కలెక్టర్‌కు ఫోన్‌చేసి చండూర్ ఎత్తిపోతల ప్రాజెక్టుకు వెంటనే మరమ్మతులు చేసి రైతుల పంటను కాపాడాలని తెలిపారు. అలాగే రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ కుమార్‌రెడ్డికి, జిల్లా కలెక్టర్‌కు లేఖ రాసి పంపించినట్లు గుజిరి తండా మాజీ సర్పంచ్ రాకేష్‌నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు దాసరి శేషాద్రి, నర్సింహులు, విష్ణు, శ్రీను నాయక్, బాన్సీలాల్, సర్వన్నాయక్, పన్యేలాల్ తదితరులు ఉన్నారు.
మండలంలోని చండూర్ గ్రామ శివారులోని రెవెన్యూ గ్రామం గుజిరి తండా రైతులకు సర్వే నెంబర్ 67లో లావని పట్టా భూమి 301 ఎకరాలు ఉన్నదని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డికి మాజీ సర్పంచ్ రాకేష్‌నాయక్ తెలిపారు. తాండలో రైతులు కబ్జాలో 350 ఎకరాలలో ఉన్నారు. 49 ఎకరాలకు పట్టాదారులకు పట్టా పాస్ పుస్తకాలు అందజేయాలని ఎమ్మెల్యే తాండ రైతులు కోరారు. తండా రైతులకు భూమి ఉండి ప్రభుత్వ పథకాలు అమలు కావడం లేదన్నారు. సర్వే 67లో ఏడీ సర్వే చేసి 49 ఎకరాల భూమికి సప్లిమెంటరీ సేత్వర్ చేసి 50 ఎకరాల భూమిని పెంచవలసినదిగా ఎమ్మెల్యే రైతులు కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన రైతులు పాల్గొన్నారు.