రామాయంపేట/నిజాంపేట/మెదక్ రూరల్, అక్టోబర్ 8: మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో బుధవారం కేంద్ర బృందం వరద నష్టాన్ని అంచనా వేసింది. పర్వతాపూర్ రోడ్డుతో పాటు వాగు బ్రిడ్జిని సందర్శించి నష్టం వివరాలు అంచనా వేశారు. అనంతరం పర్వతాపూర్ గ్రామస్తులను, స్థానిక అధికారుల ద్వారా వివరాలు సేకరించారు. నిజాంపేట మండలం నందిగామ శివారులో ధ్వంసమైన బ్రిడ్జి, తాత్కాలికంగా చేపట్టిన రోడ్డు పనులను, నిజాంపేట మల్కచెరువు మత్తడి వద్ద కూలిన బ్రిడ్జిని కేంద్ర బృందం సభ్యులు డాక్టర్ కె.పొన్నుస్వామి, వినోద్‌కుమార్, అభిషేక్‌కుమార్, పింటు పరిశీలించారు. వారివెంట మెదక్ కలెక్టర్ రాహుల్‌రాజ్ ఉన్నారు.
జిల్లాలో గత నెలలో భారీ వర్షాలకు అపార నష్టం జరిగిందని, వరద నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందం జిల్లాలో పర్యటించారని కలెక్టర్ తెలిపారు. కేంద్ర బృందం వెంట ఆర్డీవో రమాదేవి, ఆర్అండ్బీ అధికారులు, తహసీల్దార్ శ్రీనివాస్, విద్యుత్ ఏఈ గణేశ్,ఆర్ఐ ఇమాద్,మండల ఏవో సోమలింగారెడ్డి, ఆయా శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు ఉన్నారు. మెదక్, హవేళీ ఘన్పూర్ మండల పరిధిలోని మక్తభూపతిపూర్, తిమ్మానగర్, ఖాజాపూర్, కోంటూర్, హవేళీ ఘన్పూర్, పెద్ద చెరువు, బ్యాతోల్ తిమ్మయిపల్లి తదితర గ్రామాల్లో కేంద్ర బృందం పర్యటించింది. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన పంటలు, రోడ్లు, దెబ్బతిన్న కుంట కట్టలను పరిశీలించి వివరాలు సేకరించారు. వారి వెంట కలెక్టర్ రాహుల్‌రాజ్, అదనపు కలెక్టర్ నగేశ్, మెదక్ ఆర్డీవో రమాదేవి, ఇతర అధికారులు ఉన్నారు.