రాయపోల్, నవంబర్ 18:గ్రామీణ ప్రాంతాల ప్రజల కోసం సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలకేంద్రంలో 1980లో సెంట్రల్ బ్యాంకు సేవలను ప్రారంభించారు. మొదట్లో కొద్దిమంది ఖాతాదారులు సేవలను వినియోగించుకున్నారు. ఇప్పటి వరకు చుట్టూ పరిసర గ్రామాలకు చెందిన దాదాపు 25 వేలకుపైగా ఖాతాలు కలిగి ఉన్నారు. రాయపోల్ కొత్తగా మండల కేంద్రం కావడంతో దాని చుట్టూ ఉన్న గ్రామాల ప్రజలు రోజూ వివిధ పనులు, వ్యాపారాలు నిర్వహించేందుకు రాయపోల్‌కు రావడం పరిపాటిగా మారింది. బ్యాంకు సేవలు వినియోగించుకునేందుకు సహజంగానే ఖాతాదారుల సంఖ్య పెరిగింది. చాలా ఏండ్లుగా నగదు లావాదేవీల్లో వినియోగదారులు నానా తంటాలు పడుతున్నారు.
ఇందుకోసం నగదు లావాదేవీలు జరుపుకొనేందుకు ఏటీఎం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు, ఖాతాదారులు ఎన్నోసార్లు బ్యాంకు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. అప్పట్లో భవన వసతి లేక గ్రామంలో ఇరుకైన గదిలోనే బ్యాంకు కార్యకలాపాలు మొదలుపెట్టారు. రోజూ రైతుబంధు, పింఛన్‌దారులు, పీఎం కిసాన్, క్రాప్‌లోన్, మహిళా గ్రూపులు , నగలు తాకట్టుపెట్టేవారు ఇలా వినియోగదారులు బ్యాంకుకు రావడంతో రద్దీ ఎక్కువైంది. గదులు ఇరుకుగా ఉండటం, ఖాతాదారులు ఒక్కసారిగా తరలిరావడం వల్ల ఒకానొక సందర్భంలో ఊపిరాడని పరిస్థితి నెలకొంటోంది. దీనికితోడు ఏటీఎం సదుపాయం అందని ద్రాక్షలా మారడంతో ఖాతాదారులు ఇబ్బందులు పడుతున్నారు.
రాయపోల్ సెంట్రల్ బ్యాంకులో వసతులు సక్రమంగా లేవు. బ్యాంకు భవనం కూడా శిథిలావస్థకు చేరుకున్నది. ఖాతాదారులు, బ్యాంకు సిబ్బంది పడుతున్న ఇబ్బందులు తెలుకొని వరంగల్ సెంట్రల్ బ్యాంకు రీజినల్ మేనేజర్ కృష్ణమోహన్‌తో పాటు బ్యాంక్ సిబ్బంది, అధికారులు ఇటీవల రాయపోల్ బ్యాంకును పరిశీలించారు. గ్రామ పంచాయతీ భవనంలోకి మార్చాలని గ్రామస్తులు కోరగా లాకర్ సౌకర్యం లేదని, అది సాధ్యం కాదని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉన్న బ్యాంకు పక్కనే విశాలమైన భూమి ఉందని, సదరు భూమి యజమాని సైతం బ్యాంకు అనుమతులు ఇస్తే అరు నెలల్లోపు కొత్త భనవం నిర్మించి ఇస్తానన్నాడు. టెండర్ అగ్రిమెంట్ ఉండడంతో కొంత ఆలస్యం జరిగినా కొత్తగా బ్యాంకుకు భవనం నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సెంట్రల్ బ్యాంకు రీజినల్ మేనేజర్ కృష్ణమోహన్ తెలిపారు.