మెదక్ మున్సిపాలిటీ, ఫిబ్రవరి 23 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తున్నాయని సీపీఐ మాజీ జిల్లా కార్యదర్శి అకిరెడ్డి రాజిరెడ్డి విమర్శించారు. మార్చి 22వ తేదిన జిల్లా కేంద్రం మెదక్‌లోని టీఎన్జీవో భవన్లో నిర్వహించే దళిత హక్కుల పోరాట సమితి(డిహెచ్పీఎస్) జిల్లా మూడో మహాసభలకు సంబంధించిన కరపత్రాన్ని ఆదివారం ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా రాజిరెడ్డి మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చి 76 సంవత్సరాలు గడిచినా నేటికి జిల్లాలో కులవివక్ష, అంటరానితనం, రెండు గ్లాసుల పద్ధతి కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులకు బడ్జెట్లో వాటాగా కేటాయించాల్సిన నిధులను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. దళితులు ఆర్థికంగా ఎదిగేందుకు ఇవ్వాల్సిన సబ్సిడీ రుణాలు ఇవ్వడంలో పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. పైవేటు రంగంలో సైతం దళితులకు రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇందిరమ్మ ఇళ్లు, ఇతర సంక్షేమ పథకాలలో దళితులకు ప్రత్యేకంగా వాటా కేటాయించాలని రాజిరెడ్డి డిమాండ్ చేశారు. దళితుల హక్కుల పరిరక్షణ కోసం దళిత హక్కుల పోరాట సమితి నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. మార్చి 22న నిర్వహించే జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సంగమేశ్వర్, సంతోషి, లక్ష్మన్, గౌతమ్, దశరత్ తదితరులు పాల్గొన్నారు.