మెదక్ మున్సిపాలిటీ/ మెదక్ అర్బన్/ మెదక్ రూరల్/ రామాయంపేట/ నర్సాపూర్/ నిజాంపేట/ వెల్దుర్తి/ చేగుంట/చిలిపిచెడ్, డిసెంబర్ 25 : ఆసియాలోనే రెండో అతి పెద్ద చర్చిగా పేరుగాంచిన మెదక్ చర్చిలో బుధవారం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా క్రిస్మస్ సంబురాలు అంబరాన్నంటాయి. తెల్లవారు జామునే 4.30 గంటలకు శిలువ ఊరేగింపుతో ప్రారంభమయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచే చాలామంది భక్తులు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడానికి మెదక్ సీఎస్ఐ చర్చికి తరలివచ్చారు. కులమతాలకతీతంగా వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా వచ్చిన భక్తులతో చర్చి ప్రాంగణం కిటకిటలాడింది. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ర్టాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులు, సందర్శకులు భక్తిశ్రద్ధలతో ఏసును ప్రార్థించారు. మొదటి ఆరాధనకు మెదక్ డయాసిస్ అధ్యక్ష మండల ఇన్చార్జి బిషప్ రెవరెండ్ రూబెన్ మార్క్ పాల్గొని భక్తుల నుద్దేశించి వాక్యోపదేశం వినిపించారు.
లోక రక్షకుడిగా ఈ లోకానికి వచ్చిన దేవుడు ఏసుప్రభువు అని మెదక్ ఇన్చార్జి బిషప్ రెవరెండ్ రూబెన్ మార్క్ అన్నారు. క్రిస్మస్ను పురస్కరించుకుని మెదక్ చర్చిలో ఉదయం 4.30 గంటలకు నిర్వహించిన తొలి ఆరాధన ప్రార్థనల్లో పాల్గోని దైవ సందేశం వినిపింశారు. ఆసియా ఖండంలోనే ప్రసిద్ధి గాంచిన రెండో అతి పెద్దది మెదక్ చర్చి కావడం విశేషమన్నారు. ఈ మహా దేవాలయం నిర్మించి నేటికి వంద ఏండ్లు కావడం మన జీవితాల్లో ఓ మైలురాయి అన్నారు. 1924 డిసెంబర్ 25న మెదక్ చర్చిలో తొలి క్రిస్మస్ జరుపుకోన్నామని, నేటితో 100వ క్రిస్మస్ జరుపుకోవడం ఆనందాన్నిస్తోందన్నారు.
విశ్వానికి మార్గం చూపే రక్షకుడు ఏసయ్య, దేవుడే మానవుడిగా ఏసుక్రీస్తు రూపంలో ఈ లోకానికి వచ్చాడని చర్చి ప్రెసిబెటరీ ఇన్చార్జి రెవరెండ్ శాంతయ్య అన్నారు. ఉద యం 10 గంటలకు రెండో ఆరాధన ప్రార్థన అనంతరం భక్తులనుద్దేశించి దైవ సందేశం వినిపింశారు. ఈ ప్రపంచానికి సృష్టికర్త ఏసుప్రభువని, ప్రభువు జననం సర్వమానవాళికి సంతోషకరమన్నారు. ప్రభువుని హృదయ పూర్వకంగా ఆరాధించే వారందరికీ విశ్వాసంగా ఉంటారన్నారు. ప్రత్యేక ప్రార్థనల్లో పాస్టర్లు డేవిడ్, శ్రీనివాస్, జైపాల్ మెద క్ చర్చి కమిటీ సభ్యులు గంట సంపత్, సంశాన్ సందీప్, జాన్సన్, సువన్డగ్లస్, వసతి గృహాల మేనేజర్ జాయ్ముర్రె పాల్గొన్నారు.
క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు ఇబ్బందులు కలుగకుండా సీఎస్ఐ కమిటీ సభ్యులు భారీ ఏర్పా ట్లు చేశారు. బస్సు డిపో ఎదురుగా గల మెయిన్ గేట్ నుం చి మొదలుకుని చర్చి ముఖద్వారం వరకు బారీకెడ్లు ఏర్పాటుచేశారు. ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా డ్రోన్ కెమెరాలతో చర్యలు తీసుకున్నారు.
చర్చి ప్రాంగణమంతా రంగురంగుల విద్యుత్తు దీపాలతో శోభాయమానంగా మారింది. భక్తులకు ఎంతో ఆహ్లాదాన్ని ఇచ్చింది. డయాసిస్, చర్చి కమిటీ సభ్యులతో కలిసి బిషప్ క్రిస్మస్ కేక్ కట్ చేశారు. భక్తుల కోసం జాయింట్‌వీల్ తదితర ఆట వస్తువులను జాతరలో ఏర్పాటుచేశారు.