సిద్దిపేట, మే 19: అమెరికాలో ఉన్నా ప్రజల కష్టాలు, రైతుల ఇబ్బందుల మీదనే తన ధ్యాస అంటూ మరోసారి మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు చాటుకున్నారు. తన కుమారుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాన్వొకేషన్ పట్టా అందుకున్న సందర్భంగా ఇటీవల ఆయన అమెరికా వెళ్లారు. సిద్దిపేట నియోజకవర్గంతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు వేగంగా చేపట్టకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదురొంటున్నారు. ప్రధానంగా సిద్దిపేట జిల్లాలో సమస్య ఎకువగా ఉందని తన దృష్టికి రావడంతో తక్షణమే స్పందించారు.
అమెరికాలో ఉన్నా అన్నదాతలు ఆందోళనలో ఉన్నారని తెలుసుకొని మంగళవారం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, సిద్దిపేట కలెక్టర్ హైమావతితో ఫోన్లో మాట్లాడి రైతులు పడుతున్న ఇబ్బందులు వారి దృష్టికి తీసుకెళ్లారు.. ఒక వైపు వడ్లు.. మరో వైపు పొద్దుతిరుగుడు ధాన్యం కొనుగోలు చేయక కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారని, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రైతులు రోడ్లపైకి వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యంతో పాటు పొద్దుతిరుగుడు కొనుగోలు చేయాలని కోరారు.
40 రోజులకు పైగా పొద్దు తిరుగుడు రైతులు కేంద్రాల వద్ద ఇబ్బందులు ఎదురొంటున్నారని వారి దృష్టికి తీసుకెళ్లారు. జొన్నల కొనుగోలు సైతం వెంటనే చేపట్టాలని, కొనుగోళ్ల కోసం రైతులంతా ఎదురుచూస్తున్నారని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోళ్లు, లారీలు, హమాలీల సమస్యలు పరిషరించడంతోపాటు ప్రభుత్వం, ప్రైవేట్ గోదాములను పూర్తిస్థాయిలో వినియోగించాలని కోరారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి కొనుగోళ్లలో వేగం పెంచాలని కోరారు.