మెదక్ అర్బన్, జూన్ 16 : మెదక్ పట్టణంలో శనివారం రాత్రి ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణకు కారణమైన 45 మందిని గుర్తించినట్లు మల్టీజోన్ ఐజీ రంగనాథ్ తెలిపారు. ఆదివారం మెదక్ పట్టణ పోలీస్స్టేషన్లో ఆయన మాట్లాడుతూ… పండుగలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. ఎవరూ రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించవద్దన్నారు. సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని కోరారు. శనివారం జరిగిన ఇరువర్గాల ఘర్షణలో 45 మందిని గుర్తించినట్లు తెలిపారు. అందులో 9 మందిని అరెస్ట్ చేసి, 3 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మరికొంత మందిని రిమాండ్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. పశువులు తరలిస్తున్నట్లు సమాచారం ఉంటే పోలీసులకు తెలపాలని సూచించారు. ఎవరూ కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని, ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అనంతరం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా ఎస్పీ డాక్టర్ బాలస్వామి, జిల్లా అదనపు ఎస్పీ మహేందర్, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మాజీ మున్సిపల్ చైర్మన్ బట్టి జగపతి, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.
మెదక్ పట్టణంలో ఇరువర్గాల ఘర్షణ జరగడంతో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ ఇచ్చిన పిలుపుమేరకు ఆదివారం మెదక్ పట్టణంలో బంద్ ప్రశాంతంగా కొనసాగింది. స్వచ్ఛందంగా వర్తక వ్యాపారులు బంద్ పాటించారు.
మెదక్ పట్టణంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ పోలీస్ పికెటిం గ్ను ఏర్పాటు చేశారు. ఐజీ రంగనాథ్ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.