గజ్వేల్, డిసెంబర్ 4: గ్రామ పంచాయతీ మొదటి దశ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల ఉపసంహరణ, పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు పూర్తవడంతో పల్లెల్లో ప్రచారం మొదలైంది. సిద్దిపేట జిల్లాలో 7 మండలాల్లో మొదటి విడతలో 163 గ్రామ పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఇందులో 17 జీపీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 146 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు ఈనెల 11న జరగనున్నాయి. అభ్యర్థులకు బుధవారం గుర్తులను అధికారులు కేటాయించారు.
అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ నమూనా బ్యాలెట్ పత్రాలతో గుర్తులను ఓటర్లకు చూపిస్తూ ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి అభ్యర్థులు ఓట్లు అడుగుతున్నారు. ప్రచారానికి మరో ఐదు రోజుల సమయం ఉండడంతో ప్రతి ఓటరును కలిసి గుర్తులను చూపిస్తున్నారు. తమకే ఓటు వేయాలని ప్రాధేయపడుతున్నారు. బీఆర్ఎస్ మద్దతుదారులుగా బరిలో ఉన్న అభ్యర్థులు కేసీఆర్ ప్రభుత్వం గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పాలన గురించి వివరిస్తు ప్రజలను ఓట్లు అడుగుతున్నారు.
గ్రామాల్లో డంపింగ్యార్డు, ట్రాక్టర్లు, నర్సరీలు, వైకుంఠధామాలు, సీసీ, మురుగురొడ్లు, కొన్ని గ్రామాల్లో మహిళ, పంచాయతీ భవనాలు, ఆడబిడ్డలకు ఇచ్చిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లు, చెరువుల మరమ్మతులు, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీళ్లు, రైతుబంధు, రైతుబీమా వంటి సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. గజ్వేల్ మండలంలోని శ్రీగిరిపల్లిలో గురువారం ఇంటింటికీ తిరుగుతూ మహిళలు కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై పాటలు పాడుతూ ఓటర్లను ఆకట్టుకున్నారు. పల్లెల్లో మహిళలు వ్యవసాయ పనులకు వెళ్లక ముందే కలుస్తున్నారు.
తిన్నరేవు మరువద్దు బిడ్డా…
పదేండ్లలో మనకు అన్నీ చేసిన పెద్దాయన కేసీఆర్ సారును మరువద్దు బిడ్డా, ఆయన చేసిన సౌలత్లే మన కళ్లకు కనిపిస్తున్నాయని గురువారం గజ్వేల్ మండలంలోని అక్కారం గ్రామానికి చెందిన వృద్ధుడు ఒకరు అన్నారు. వృద్ధుడిని ‘నమస్తే తెలంగాణ’ పలుకరించింది. రోజు ఇంట్లకే మంచి నీళ్లు తీసుకొచ్చిండు. ప్రాజెక్టులు కట్టి పొలాలకు నీళ్లిచ్చిండు. కేసీఆర్ నీళ్లు తెస్తేనే ఇవాళ పంటలు బాగా పండించుకొని బతుకుతున్నాం. అందరికీ మేలు చేసిన కేసీఆర్ను గుర్తుచేసుకోవాలే. తిన్నరేవు మరువద్దు బిడ్డా అంటూ ఆ వృద్ధుడు ఎంతో ఆప్యాయంగా మాట్లాడాడు. సర్పంచ్ కోసం ఊరిలో నలుగురు పోటీ చేస్తుర్రంటా.. పొద్దుగాళ్ల ఇటు తిరిగినోళ్లు రాత్రి ఏమో అటు కన్పిస్తుండ్రు.. ఇయాలా నీతి ఎక్కడ ఉంది బిడ్డా అంటూ ఆయన మాట్లాడారు.