హుస్నాబాద్, ఆగస్టు 1: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రాంత వరప్రదాయిని గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేసేందుకు గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. రిజర్వాయర్ తుదిదశ పనులతో పాటు కాల్వ నిర్మాణం, భూసేకరణ కోసం రూ.437 కోట్లు కేటాయిస్తూ మంత్రివర్గం తీర్మానం చేసింది. ప్రభుత్వం కేటాయించిన నిధులు సకాలంలో విడుదలై వెంటనే పనులు ప్రారంభమైతే త్వరలోనే హుస్నాబాద్ నియోజకవర్గంలో గోదావరి జలాలు జలతాండవం చేసే అవకాశం ఉన్నది.
ప్రభుత్వం గౌరవెల్లి రిజర్వాయర్‌కు నిధులు కేటాయించడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. నిధుల కేటాయింపునకు సహకరించిన సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఇరిగేషన్‌శాఖ మం త్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాగా రిజర్వాయర్ పనులు పూర్తయితే ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మారుతుందని ప్రజ లు ఆకాంక్షిస్తున్నారు.
సాగు, తాగునీటికి అల్లాడుతున్న హుస్నాబాద్ మెట్ట ప్రాంత ప్రజలు, రైతుల కోసం వరద కాల్వ లో భాగంగా నిర్మించ తలపెట్టిన గౌరవెల్లి రిజర్వాయర్‌ను రీడిజైన్ చేసి ఈ ప్రాంతం మొత్తానికి సరిపోయే విధంగా బీఆర్ఎస్ సర్కారు నిర్మాణం చేపట్టింది. 2007లో శంకుస్థాపన చేసినప్పటికీ 20 09 నుంచి 2012 వరకు 1.23టీఎంసీల సామ ర్థ్యం కోసం కట్టనిర్మాణం చేపట్టారు. అనంతరం పనులు ముందుకు సాగలేదు. 2014లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రభుత్వం రిజర్వాయర్ సామర్థ్యాన్ని 8.23టీఎంసీలకు పెంచి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి 95శాతం పనులు పూర్తి చేసింది.
టన్నెల్, పంపుహౌస్ నిర్మాణం, మూడు భారీ మోటార్లు, పంపుల బిగింపు జరగ డం, కట్ట నిర్మాణం పూర్తవడంతో అప్పటి ఎమ్మె ల్యే వొడితెల సతీశ్‌కుమార్ రెండు సార్లు ట్రయల్న్ నిర్వహించి ప్రాజెక్టులోకి సుమారు 0.5టీఎంసీల నీటిని సైతం నింపారు. ఎన్జీటీ కేసుతో నీటి పంపింగ్‌కు బ్రేక్ పడింది. కాల్వల నిర్మాణానికి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయించింది. అంతలోనే ప్రభుత్వం మారడంతో ప్రాజె క్టు నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. కొత్త ప్రభుత్వంలో మంత్రివర్గం నిధులు కేటాయించి ప్రాజెక్టును పూర్తి చేస్తామని తీర్మానం చేయడంతో భూనిర్వాసితులు, రైతులు, ఈ ప్రాంత ప్రజల్లో ఆశలు చిగురించినట్లయింది.