చేగుంట, మే 10: మెదక్ జిల్లా నిజాంపేట మం డలం తిప్పన్నగుల్లకు చెందిన రిటైర్డ్ సైనికుడు సిద్దిపేట ఎల్లం దేశం కోసం ప్రాణాలను లెక్క చేయలేదు. ఆయన కార్గిల్ యుద్ధ్దంలో పా ల్గొని ఎడమ కాలికి బుల్లెట్ దిగడంతో గాయపడ్డారు. 1997 నుంచి 2017 వరకు ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయ్యారు. ప్రస్తుతం మెదక్ జిల్లా చేగుంట మండలంలో ఎక్స్ సర్వీస్‌మెన్ కోటాలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఎల్లం ప్రస్తుతం చేగుంటలో నివసిస్తున్నారు.
తిప్పనగుల్లకు చెందిన సిద్దిపేట రాజమ్మ-రాజయ్యల రెండో సంతానమైన ఎల్లం, చిన్నతనం నుంచి ఆర్మీలో చేరి దేశసేవ చేయాలనే సంకల్పం ఉండేది.1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు నార్లపూర్‌లో, 7నుంచి 10 వరకు నిజాంపేట ప్రభుత్వ పాఠశాలలో, ఇంటర్ రెండో సంవత్సరం వరకు రామాయంపేట ప్రభుత్వ కళాశాలలో చదివారు. ఇంటర్ చదివే సమయంలో సిపాయిగా భారత ఆర్మీలో చేరి హైదరాబాద్ గోల్కొండలో శిక్షణ పూర్తి చేసుకున్నారు.
ఆ తరువాత 1998 నుంచి 2001 వరకు జమ్ముకశ్మీర్‌లోని నవ్‌గావ్ సెక్టార్లో పనిచేశారు.1998 డిసెంబర్లో కార్గిల్ యుద్ధ్దం సమయంలో సిఫాయిగా పనిచేశారు. ఆ యుద్ధ్దంలో ఆయన ఎడమ కాలికి బుల్లెట్ గాయమైంది. 2003 నుంచి 2006 వరకు జమ్ముకశ్మీర్‌లోని రాజోరి సెక్టార్లో, 2006 నుంచి 2009 వరకు పంజాబ్‌లోని పఠాన్పూర్లో, 2009 నుంచి 2011 వరకు జమ్ముకశ్మీర్‌లోని కార్గిల్ సెక్టార్లో, 2011నుంచి 2013 మహారాష్టలోని నాసిక్‌లో జవాన్లకు గన్నుల తోప్కాన్పై శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. 2013 నుంచి 2017 వరకు అరుణాచల్‌ప్రదేశ్‌లో చైనా బార్డర్లో పనిచేశారు. 2017లో రిటైర్డ్ అయినట్లు ఎల్లం తెలిపారు.
యుద్ధానికి ఇప్పుడూ రెడీ..
యుద్ధానికి రమ్మంటే ఇప్పుడైనా పాల్గొంటా. దేశ రక్షణే నాకు ముఖ్యం. శత్రు దేశమైన పాకిస్థాన్‌ను ఎలా ఎదుర్కొవాలే భారత సైన్యానికి బాగా తెలుసు. ఉగ్రవాదులను మొదటి నుంచి పెంచి పోషిస్తున్నది పాక్. పాక్‌లో ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి మన దేశంలోకి పంపుతారు. మన సరిహద్దుల చుట్టూ కంచె ఉంటుంది. కొన్ని చోట్ల గుట్టలుగా ఉన్న చోటునుంచి జమ్ముకశ్మీర్ వంటి ప్రాంతాల నుంచి ఉగ్రమూకలు చొరబడతాయి.
-సిదిపేట ఎల్లం, మాజీ సైనికుడు