ఈ పక్కనున్న ఫొటోను ఒకసారి చూడండి.. రాయితో గురిపెట్టి కొట్టినట్లు అన్ని కిటికీల అద్దాలు పగిలిపోయి కనిపిస్తున్నాయి కదూ.. ఇదీ అదే బుధేరా మహిళా డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాలనే.. ఇంత అధ్వానంగా తయారైనా ఎవరూ పట్టించుకున్న పాపాన పోవడం లేదు. కళాశాల చుట్టూ ప్రహరీ లేకపోవడంతో రక్షణ కరువైంది. హాస్టల్‌కు ఎప్పుడు, ఎవరు వస్తున్నారో.. ఎప్పుడు పోతున్నారో ఎవరికీ తెలియని పరిస్థితి. దీంతో విద్యార్థినులు బిక్కుబిక్కుమంటూ విద్యనభ్యసిస్తున్నారు.
పైనున్న గోడపై రాసిన రాతలు ఎక్కడై ఉంటుందో ఒకసారి ఊహించండి.. బస్టాండో.. రైల్వేస్టేషనో.. లేక, సులభ్ కాంప్లెక్స్‌ల వద్ద రాసిన పిచ్చి రాతలు, గీతలు అనుకుంటున్నారా..? అలా అనుకుంటే మీరు పొరబడినట్లే.. ఇది ఒక మహిళా డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాల. పేద విద్యార్థులకు ఉన్నత విద్యనందించేందుకు, వారి బంగారు భవిష్యత్‌కు బాటలు వేసేందుకు కేసీఆర్ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన కళాశాలల్లో ఇదీ ఒకటి.. మునిపల్లి మండలం బుధేరా శివారులోని మహిళా డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాల. మెరుగైన విద్యనందించేందుకు గ్రంథాలయ భవనాన్ని నిర్మించి విద్యార్థినులకు అందుబాటులో ఉంచారు. ఈ గ్రంథాలయ గోడలపై గుర్తు తెలియని వ్యక్తులు తప్పుడు రాతలు రాశారు. ‘కాల్ మీ’ అంటూ ఫోన్ నంబర్లు, లవ్ సింబళ్లు దించారు.
మునిపల్లి, డిసెంబర్ 26: మండలంలోని బుధేరా చౌరస్తాలోని మహిళా డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థినుల కోసం నిర్మించిన గ్రంథాలయ భవనం మందుబాబులకు అడ్డాగా మారింది. గ్రంథాలయ పరిసర ప్రాంతాల్లో పెన్సిళ్లతో ఇష్టానుసారంగా తప్పుడు రాతలు రాశారు. ఫోన్ నంబర్లు రాశారు. గ్రంథాలయ భవనం చుట్టూ మందుబాబులు తాగి పడేసిన మద్యం బాటిళ్ల పచ్చలు కనిపిస్తున్నాయి. గ్రంథాలయ భవనం కిటికిలను ధ్వంసం చేశారు. సీసీ కెమెరాలు పని చేస్తున్నా సంబంధిత కళాశాల సిబ్బంది ఎందుకు పట్టించుకోవడం లేదని విద్యార్థినుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇంత జరుగుతున్నా కళాశాల సిబ్బంది, సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం దారుణం. అటు వైపు కన్నెత్తి చూడకపోవడం విడ్డూరమని వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, కళాశాల సిబ్బంది స్పందించి నిఘా పెంచి విద్యార్థినులను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.