గజ్వేల్ అర్బన్, అక్టోబర్ 20: బూత్ స్థాయి సమావేశంతో బీఆర్ఎస్ కార్యకర్తల్లో ఉత్సాహం ఉప్పొంగింది. గజ్వేల్ నియోజకవర్గ స్థాయి బూత్‌లెవల్ కార్యకర్తల సమావేశాన్ని శుక్రవారం అంతాయిపల్లిలోని ఎస్ఎన్ఆర్ ఫంక్షన్హాల్లో నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగం బీఆర్ఎస్ కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపింది. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఈ ప్రాంత కష్టాలు, కన్నీళ్లు, రైతులు పడ్డ గోసను, తెలంగాణ ఏర్పాటు అవసరాన్ని, ఉద్యమ ప్రారంభమైన విధానాన్ని సీఎం కేసీఆర్ కార్యకర్తలకు మరోసారి గుర్తు చేశారు. ఏది ఏమైనా తెలంగాణ రైతులు, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలన్న ఏకైక లక్ష్యంతో బీఆర్ఎస్ పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు. గజ్వేల్ నాయకులు, కార్యకర్తలు కేవలం గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ను గెలిపించడమే కాకుండా నర్సాపూర్, మెదక్‌లోనూ బీఆర్ఎస్ గెలుపునకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. వేలసంఖ్యలో బైక్‌లపై ర్యాలీగా నర్సాపూర్, మెదక్‌కు వెళ్లాలని సీఎం సూచించారు. సీఎం కేసీఆర్ చేసిన దిశానిర్దేశం కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం, ఆత్మవిశ్వాసాన్ని నింపింది. సీఎం కేసీఆర్‌ను దగ్గరగా చూడడం, తమను ఉద్దేశించి ప్రసంగించడంతో కార్యకర్తలు సంతోషపడ్డారు. అనుకున్న దానికన్నా నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో రావడంతో సమావేశం హాలు మొత్తం కిక్కిరిసిపోయింది. తిరిగి వెళ్తున్న కార్యకర్తల్లో ఎంతో సంతృప్తి, ఉత్సాహం కనబడింది.
ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొట్టాల యాదగిరి మాట్లాడుతూ.. ముదిరాజ్‌లను, బీసీ సబ్బండ వర్గాలను ఏప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. సీఎం కేసీఆర్ సబ్బండ వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేసినట్లు తెలిపారు. 2014కు ముందు తెలంగాణలో 3వేల మత్స్య సహకార సొసైటీలు ఉంటే, 6వేల సొసైటీలను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఈ సొసైటీల ద్వారా 4లక్షల మంది మత్స్యకారులు లబ్ధి పొందారన్నారు. త్వరలో మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల్లో మత్స్యకారులకు చేపలు పట్టడానికి లైసెన్సులు ఇవ్వనున్నట్లు తెలిపారు. పోలీస్ కిష్టయ్య అమరుడైన తర్వాత ఆయన కుమార్తెను సీఎం కేసీఆర్ సొంత ఖర్చుతో చదివించి డాక్టర్‌ను చేశారని, ప్రస్తుతం ఆ అమ్మాయి మెడిసిన్‌లో పీజీ చేస్తున్నట్లు తెలిపారు. దీనికి సీఎం కేసీఆర్ సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. మూడోసారి కేసీఆర్ సీఎం అయితే సబ్బండ వర్గాలు ఆర్థికంగా, రాజకీయంగా మరింత బలోపేతం అవుతారని చెప్పగానే కార్యకర్తల నుంచి జైకేసీఆర్ అంటూ నినాదాలు వినిపించాయి.