నర్సాపూర్, డిసెంబర్ 9: స్థానిక మహిళా ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డిని ఆహ్వానించకుండా ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థితో మహిళలకు ఉచిత బస్సును ప్రారంభించడం అధికారులకు ఎంతవరకు సమంజసమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు అశోక్‌గౌడ్ ధ్వజమెత్తారు. శనివారం నర్సాపూర్‌లో ఆయనతోపాటు మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమొద్దీన్, బీఆర్ఎస్ నాయకులు విలేఖరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్‌గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో మహిళలకు సముచిత గౌరవం కల్పిస్తామని ఓ వైపు ఆ పార్టీ నాయకులు ఊదరగొడుతూనే, మహిళా ఎమ్మెల్యేను మహాలక్ష్మీ పథకం ప్రారంభోత్సవానికి ఆహ్వానం తెలపకపోవడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ప్రొటోకాల్ పాటించకుండా ఆర్టీసీ అధికారులు ప్రారంభోత్సవం చేయడం ఎంటని ప్రశ్నించారు.
నర్సాపూర్ మున్సిపాలిటీలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్ ఇండ్లను కూల్చివేయించి, ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి పేరు చెప్పడం తగదని హెచ్చరించారు. ఎమ్మెల్యేగా బరిలో ఉన్న తనకు ఓటు వేయలేదనే కక్షతోనే మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్ పేదల ఇండ్లు కూల్చివేయించడాని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో మూడో స్థానంలో రావడంతో మురళీయాదవ్ తట్టుకోలేకపోతున్నాడని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డిపై తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. గతంలో బీఆర్ఎస్లో గెలిచి, నేడు ఇంకా మున్సిపల్ చైర్మన్ పదవిని అంటిపెట్టుకొని ఉన్నాడని, తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీలో పాత భవనాలను కూల్చివేసి స్క్రాప్‌లో మురళీయాదవ్ పెద్దఎత్తున అవినీతికి పాల్పడ్డాడని ఆరోపించారు. త్వరలోనే వాటన్నిటినీ బయటపెడతామని, కలెక్టర్‌కు సైతం ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
మహిళా ప్రాధాన్యం ఎక్కడ..; బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు భిక్షపతి
కాంగ్రెస్ పాలనలో మహిళా ప్రాధాన్యం ఎక్కడుందని బీఆర్ఎస్ నర్సాపూర్ పట్టణాధ్యక్షుడు భిక్షపతి ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా ఎమ్మెల్యేను కించపర్చే విధంగా మహిళలకు ఉచిత బస్సును ప్రారంభించడం ఎంత వరకు సమంజసమని వెల్లడించారు. ప్రొటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డిని ఆహ్వానించకుండా మహాలక్ష్మీ పథకాన్ని ప్రారంభించడం విడ్డూరంగా ఉందన్నారు. రాజకీయంలో గెలుపు, ఓటములు సహజమని మురళీయాదవ్ కక్షపూరితంగా ఇండ్లను కూల్చేపించాడని విమర్శించారు.
డిపో మేనేజర్ క్షమాపణ చెప్పాలి ; బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సత్యంగౌడ్
ప్రొటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డిని ఆహ్వానించకుండా మహిళలకు ఉచిత బస్సును ప్రారంభించిన నర్సాపూర్ డిపో మేనేజర్ తక్షణమే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సత్యంగౌడ్ డిమాండ్ చేశారు. మహిళా ఎమ్మెల్యే అనే గౌరవం లేకుండా మహాలక్ష్మీ పథకాన్ని ఆర్టీసీ అధికారులు ప్రారంభించడాన్ని తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నగేశ్, ఆంజనేయులుగౌడ్, దావూద్ తదితరులు పాల్గొన్నారు.