టేక్మాల్, ఏప్రిల్ 16: ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని, ఈనెల 27న చలో వరంగల్ సభను విజయవంతం చేయాలని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. టేక్మాల్‌లో బుధవారం రజతోత్సవ వాల్ పోస్టర్‌ను పార్టీ నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ ఆవిర్భవించిందని, ఎన్నో ఒడిదుడుకులు, కష్టాలను అధిగమించి తెలంగాణ రాష్ర్టాన్ని కేసీఆర్ నాయకత్వంలో సాధించుకున్నామన్నారు.
పార్టీ ఆవిర్భవించి 25 ఏండ్లు గడుస్తున్న తరుణంలో రజతోత్సవాలను నిర్వహించేందుకు సంకల్పించిందన్నారు. సభను విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులు, తెలంగాణ ఉద్యమకారులు, అభిమానులు పెద్దసంఖ్యలో తరలిరావాలన్నారు. మండలంలోని ప్రతి గ్రామం నుంచి ప్రజలు, కార్యకర్తలు, ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులు తరలిరావడానికి సన్నద్ధం కావాలని ఆకాంక్షించారు. అధికారంలో ఉన్న పదేండ్లలో ప్రజా సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసిందని గుర్తుచేశారు.
స్వరాష్ట్ర ఉద్యమ ఆకాంక్షతో ఆవిర్భవించిన బీఆర్ఎస్ ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను తీసుకువచ్చి తెలంగాణ ప్రజలను అన్ని రంగాల్లో అగ్రగామిగా ముందుకు నడిపించిందని తెలియజేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేసి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం తథ్యమన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భక్తుల వీరప్ప, నాయకులు సిద్దయ్య, రవి, రజాక్, సాయిబాబా, మల్లేశం, సలావోద్దీన్, సాయిలు, సంగయ్య, బాలకృష్ణ, నారాగౌడ్ ఉన్నారు.