సిద్దిపేట, ఏప్రిల్ 25(నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ ఉద్యమంతో సిద్దిపేటకు అవినాభావ సంబంధం ఉందని, గులాబీ జెండా పుట్టిందే సిద్దిపేట నుంచి అని, ఆనాటి కేసీఆర్ ఆమరణ దీక్ష ..2001లో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావమైన సిద్దిపేటతో తెలంగాణ ఉద్యమానికి పేగు బంధం ఉందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేటలోని రంగధాంపల్లి అమరవీరుల స్తూపానికి పూలు వేసి నివాళులర్పించారు. అనంతరం వరంగల్ సభకు సిద్దిపేట నియోజకవర్గం నుంచి 1500 మంది యువత చేపడుతున్న పాదయాత్రను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. వారితో కలిసి దాదాపు 6 కిలోమీటర్లకు పైగా పాదయాత్రలో పాల్గొన్నారు.
వారితో కలిసి మధ్యాహ్నం భోజనం చేసి కాసేపు ముచ్చటించారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ… సిద్దిపేట నుంచి ప్రారంభించిన యువత పాదయాత్ర రేపటి మన బీఆర్ఎస్ విజయయాత్ర కాబోతున్నదని జోస్యం చెప్పారు. ఈ సిల్వర్‌జూబ్లీకి మన పాదయాత్ర జైత్రయాత్ర కాబోతున్నదన్నారు. బీఆర్ఎస్ పుట్టినరోజు చాలామంది చాలారకాలుగా మాట్లాడారని, గాలిబుడగ, పాలపొంగు లాంటిదని.. అమావాస్యకు పుట్టింది.. పున్నానికి పోతదని హేళన చేశారన్నారు. హేలన చేసిన వారే ఆగమయ్యారని, వెక్కిరించిన పార్టీలే కనుమరుగయ్యాయని, కానీ.. బీఆర్ఎస్ పార్టీ ఆగం కాలేదన్నారు. దేశంలో చాలా పార్టీలు పుడుతుంటాయి..పోతుంటాయని.. కానీ, బీఆర్ఎస్ తన లక్ష్యాన్ని ముద్దాడిందన్నారు.
తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన పార్టీబీఆర్ఎస్ అని కార్యకర్తల హర్షధ్వానాల మధ్యన హరీశ్‌రావు పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో అంబేద్కర్, గాంధీజీ బాటలో నడిచిన, శాంతియుత పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించామని హరీశ్‌రావు గుర్తుచేశారు. బీఆర్ఎస్ ఎప్పుడూ తెలంగాణ ప్రజల పక్షాన ఉంటుందని, పద్నాలుగేండ్ల పాటు ఉద్యమం ..పదేండ్ల పాలన, సంవత్సరన్నర ప్రతిపక్ష పాత్ర బీఆర్ఎస్ పోషించిన విషయాన్ని గుర్తుచేశారు. పదేండ్లలో బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్నిరంగాల్లో అద్భుత ప్రగతి సాధించిందన్నారు.
అనేక పథకాలు, కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 420 హామీలు, ఆరుగ్యారెంటీలు ఇచ్చి ప్రజల్లో ఆశలు పెట్టి తీరా గద్దెనెక్కిన తర్వాత మోసం చేసిందన్నారు. బీఆర్ఎస్ గెలిచినప్పుడు పొంగిపోలేదు.. ఓడిపోయినప్పుడు కుంగి పోలేదన్నారు. ఓడినా.. గెలిచినా ప్రజల మధ్యనే ఉంటాం..ప్రజల కోసం పని చేస్తామని హరీశ్‌రావు చెప్పారు. ఇవాళ మనం చేసే పాదయాత్ర కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు కావాలన్నారు. ఆనాడు లంకలో రావణుడు చేసిన అరాచకాలను ఎదిరించడానికి రామదండు కదిలిందని..నేడు రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి ప్రభు త్వ అరచకాలను ఎదిరించడానికి ఈ గులాబీ దందు కదిలిందని హరీశ్‌రావు అన్నారు.
ఈ గులాబీ దండు మూడు రోజుల పాటు 70 కిలోమీటర్లు పాదయాత్ర చేసి బీఆర్ఎస్ రజతోత్సవ సభ స్థలాకి చేరుకుంటుందని తెలిపారు. పాదయాత్రలో భాగంగా గ్రామాల్లో రైతులను, అవ్వా తాతలను కలిసి ప్రతి ఒక్కరితో మాట్లాడి.. కాంగ్రెస్ పార్టీ అరాచకాలను వారికి వివరించాలని యువతకు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ప్రజలందరూ మళ్లీ కేసీఆర్ రావాలని.. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. క్రమశిక్షణగా పాదయాత్ర చేపట్టాలని, ఎండల తీవ్రత దృష్ట్యా ఉదయం పాదయాత్ర ప్రారంభించాలని సూచించారు.
పురిటి గడ్డ సిద్దిపేట మరోసారి పులకరించింది. బీఆర్ఎస్ రజతోత్సవం సందర్భంగా సిద్దిపేట నియోజకవర్గంలోని దాదాపు రెండువేల మంది యువత పాదయాత్రగా శుక్రవారం ఎల్కతుర్తి సభకు బయలుదేరారు. పాదయత్ర రంగధాంపల్లి అమరవీరుల స్తూపం నుంచి ప్రారంభమైంది. అమరవీరుల స్తూపానికి హరీశ్‌రావు నివాళులర్పించారు. అక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభం సందర్భంగా స్థానిక కౌన్సిలర్ వంగ రేణుకా తిరుమల్‌రెడ్డి తిలకం దిద్దిస్వాగతం పలికారు.
25 ఏండ్ల పార్టీ ఆవిర్భావం సందర్భంగా 25 మీటర్ల జెండా ప్రదర్శన చేపట్టారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో పాటు సిద్దిపేటలో హరీశ్‌రావు చేపట్టిన అభివృద్ధ్ది, ఉద్యమ సందర్భాలను గులాబీ జెండాలో ప్రదర్శించారు. పాదయాత్రకు అడుగడుగునా ఘనస్వాగతం పలికారు. సిద్దిపేట-హన్మకొండ 765డీ జాతీ య రహదారి గులాబీమయంగా మారింది. అన్ని గ్రామాల్లో పాదయాత్రకు ప్రజలు ఘన స్వాగతం పలికారు.
బీఆర్ఎస్ చేపట్టిన యువత పాదయాత్రలో అడుగడుగునా పోలీసు నిఘా కనిపించింది. నిఘా అధికారులు పాదయాత్రలో కలిసి పోయి ఫొటోలు తీశారు. రంగధాంపల్లి నుంచి ప్రారంభమైన పాదయాత్రను అనుసరిస్తూ ఎక్కడికక్కడ తమ సెల్ ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీస్తూ ఉన్నతాధికారులకు చేరవేశారు. హరీశ్ ప్రసంగం మొత్తం రికార్డు చేశారు. ఎంతమంది పాదయాత్రలో పాల్గొన్నారు. స్పందన ఎలా ఉంది తదితర అంశాలను ఆరాతీశారు.
సిద్దిపేట, ఏప్రిల్ 25: సిద్దిపేటలోని రంగధాంపల్లి అమరవీరుల స్తూపం నుంచి ఎల్కతుర్తి వరకు చేపడుతున్న యువత పాదయాత్ర శుక్రవారం ప్రారంభం కాగా, రాత్రి నంగునూరు మండలం బద్దిపడగకు చేరుకుంది. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి వద్ద ప్రజలు,బీఆర్ఎస్ శ్రేణులు పటాకులు కాల్చి పాదయాత్రకు ఘనస్వాగతం పలికారు. పాదయాత్ర చేస్తున్న వారికి గ్రామస్తులు మజ్జిగను అందజేశారు. నంగునూరు మండలం ముండ్రాయిలో మాజీ సర్పంచ్ కమలాకర్‌రెడ్డి పాదయాత్రకు ఘన స్వాగతం పలికారు. గ్రామ మహిళలు మంగళహారతులు పట్టి, తిలకం దిద్ది స్వాగతం పలికారు.
ముండ్రాయి స్టేజ్ వద్ద వారిపై గులాబీ పూలను చల్లి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అకడి నుంచి పాదయాత్ర పాలమాకుల చేరుకుంది. పాలమాకుల వద్ద మధ్యాహ్నం భోజనం చేశారు. పాదయాత్రగా బయలుదేరిన విద్యార్థి యువజన విభాగం నాయకులతో ఎమ్మెల్యే హరీశ్‌రావు శుక్రవారం పాలమాకుల ఎల్లమ్మ దేవాలయం వద్ద గల ఫంక్షన్ హాల్లో వారితో మధ్యా హ్నం భోజనం చేసి ముచ్చటించారు. మీ పాదయాత్ర భవిష్యత్తు గులాబీ జెండా విజయయాత్ర అవుతుందని అన్నారు. క్రమశిక్షణతో పాదయాత్ర చేస్తూ సభాస్థలికి చేరుకోవాలని, రోడ్డుపై నడిచేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.