సిద్దిపేట, ఏప్రిల్ 24( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీఆర్ఎస్ పార్టీ 25 వసంతాలు పూర్తిచేసుకుని రజతోత్సవానికి సిద్ధం కావడంతో పురిటిగడ్డ ఉమ్మడి మెదక్ జిల్లా మురిసిపోతున్నది. తెలంగాణ ఉద్యమానికి, బీఆర్ఎస్ పార్టీకి ఆది నుంచి జిల్లా ప్రజలు అండగా నిలిచారు. ఉద్యమ నేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏ కార్యం తలపెట్టినా, ఏ పిలుపు ఇచ్చినా జిల్లా ప్రజలు పాల్గొని మద్దతుగా నిలిచారు. 2001 ఏప్రిల్ 14న సిద్దిపేటలో జరిగిన అంబేద్కర్ జయంతి సభలో పాల్గొన్న కేసీఆర్ తెలంగాణ కోసం పోరాటం తప్పదని ప్రకటించారు. 2001 ఏప్రిల్ 27న బీఆర్ఎస్ను స్థాపించిన తర్వాత ఉద్యమ పార్టీకి జిల్లా అండగా నిలిచింది. 2001లో పార్టీ ఆవిర్భవించిన తొలినాళ్లలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు బీఆర్ఎస్పై అవాకులు, చెవాకులు పేలారు.
మూడొద్దులకే పార్టీ మూసుకు పోతుందని ఎన్నో రకాలుగా హేళన చేసే మాటలు మాట్లాడారు. అయినా ఎక్కడా కేసీఆర్ వెనుకడుగు వేయకుండా ఉద్యమ పార్టీని ముందుకు తీసుకెళ్లి కృతకృత్యులయ్యారు. ఈ క్రమంలో ఆయనకు మెతుకుసీమ గడ్డ అండగా నిలిచింది. 2005లో వరంగల్‌లో నిర్వహించిన జైత్రయాత్ర సభకు కేసీఆర్ సైకిల్‌పై బయలుదేరి వెళ్లారు.సిద్దిపేట నుంచి వరంగల్ బహిరంగ సభ వరకు ఆయన వెంట సైకిళ్లపై వందలాది మంది కార్యకర్తలు, నాయకులు జిల్లా నుంచి తరలివెళ్లారు. 2006లో తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ మాట తప్పడంతో ఆ పార్టీపై కేసీఆర్ యుద్ధం ప్రకటించారు.
సిద్దిపేటలో శంఖారావం పేరిట బహిరంగ సభ నిర్వహించగా, అది సక్సెస్ అయ్యింది. వివిధ ప్రాంతాల నుంచి లక్షల్లో ప్రజలు హాజరై సభకు పెద్ద ఎత్తున మద్దతు ప్రకటించారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పటి మంత్రి ఎమ్మెస్సార్ చేసిన వ్యాఖ్యలకు సవాలుగా కేసీఆర్ కరీంనగర్ ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు సభలో ప్రకటించారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో కరీంనగర్ నుంచి కనీవినీ ఎరుగని రీతిలో భారీ మెజార్టీతో కేసీఆర్ గెలుపొందారు.
తెలంగాణ కోసం మహాధర్నా పేరిట రాజీవ్ రహదారిని దిగ్బంధం చేశారు. సిద్దిపేట శివారులోని రాజీవ్ రహదారిపై జరిగిన కార్యక్రమానికి కేసీఆర్ హాజరయ్యారు. ఆ కార్యక్రమానికి జిల్లా ప్రజలు, పార్టీ శ్రేణులు, ఉద్యమకారులు హాజరై మద్దతుగా నిలిచారు. 2008లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించిన తర్వాత కాంగ్రెస్ నాయకులకు సవాల్ చేస్తూ సిద్దిపేటలో హరీశ్‌రావు నాయకత్వంలో నిర్వహించిన ఉద్యోగ గర్జనకు భారీ స్పందన లభించింది. 2009 నవంబర్‌లో సిద్దిపేటలోని అంబేద్కర్ భవన్లో జరిగిన సమావేశంలో పాల్గొన్న కేసీఆర్ ‘తెలంగాణ వాలె జాగో.. ఆంధ్రా వాలె బాగో..’ నినాదమిచ్చారు.
ఆ తర్వాత నవంబర్ 9 పాపన్నపేట మండలంలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూములపై పద్మాదేవేందర్‌రెడ్డి, దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆందోళనకు దిగారు. హరీశ్‌రావు, కేటీఆర్, ఇతర నేతలు పాల్గొని ఆందోళనను ఉధృతం చేశారు. హైదరాబాద్ ఫ్రీజోన్ అంటూ సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. ఫ్రీజోన్ రద్దుకు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌తో కేసీఆర్ ఆమరణ దీక్షకు నిర్ణయించారు. ఆ తర్వాత చేపట్టిన అన్ని ఆందోళన కార్యక్రమాలకు మెతుకుసీమ కేసీఆర్‌కు అండగా నిలిచింది.
సిద్దిపేట రంగధాంపల్లి వేదికగా కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగుతానని ప్రకటించడంతో మరోసారి సిద్దిపేట జిల్లా వార్తల్లోకెక్కింది. ఆమరణ దీక్ష బయలుదేరిన కేసీఆర్‌ను నవంబర్ 29న కరీంనగర్ శివారులో పోలీసులు అరెస్టు చేసి ఖమ్మం తరలించగా సిద్దిపేట దీక్షా స్థలి వద్ద హరీశ్‌రావు, పద్మాదేవేందర్‌రెడ్డి, దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి తదితర నాయకులు దీక్షకు సిద్ధమవడంతో పోలీసులు భారీ సంఖ్య లో మోహరించి ఆ దీక్షాస్థలిని అణచివేశారు. ఉద్యమం మరింత ఉధృతమైంది. ఒక వైపు కేసీఆర్‌ను అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించడంతో పాటు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఉద్య మం బాట పట్టడంతో జిల్లా విద్యార్థి లోకం లేచింది. జిల్లా విద్యార్థి విభాగం నాయకులు చైతన్య పరిచేందుకు విస్తృతంగా విద్యార్థి గర్జన పేరిట సదస్సులు జరిగాయి.
ఉమ్మడి జిల్లాలో ఉద్యమంలో భాగంగా జాతీయ రహదారిపై భారీ ధర్నా నిర్వహించారు. రైలురోకోలు, తెలంగాణ కోసం రోడ్లపై వంటావార్పు, రోడ్ల దిగ్బంధం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ ఉద్యమాన్ని రోజురోజుకు ఉధృతపరుస్తూ తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ముందుకెళ్లిన ఉద్యమ బీఆర్ఎస్ పార్టీ ప్రజా సమస్యలపై కూడా పోరాటం చేసింది. ప్రతి పౌరుడు ఉద్యమంలో భాగస్వాములను చేసింది. 42 రోజుల పాటు జరిగిన సకల జనుల సమ్మెలో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషించింది. హరీశ్‌రావు నేతృత్వంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో 132 కిలో మీటర్ల పాదయాత్ర నిర్వహించారు. కాగా, ఎల్కతుర్తిలో ఈనెల 27న పార్టీ రజతోత్సవ సభను నిర్వహిస్తుండగా.. ఈ సభకు సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల నుంచి పెద్దఎత్తున పార్టీ శ్రేణులు, జనం వెళ్లడానికి ఏర్పా ట్లు చేసుకుంటున్నారు.
ఆ రోజు ప్రతి గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించి రజతోత్సవ సభకు తరలివెళ్లనున్నారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లో పార్టీ జెండాలను సిద్ధం చేశారు. రంగులు అద్దారు. వాల్ రైటింగ్, పోస్టర్లు పెద్దఎత్తున వేశారు. సోషల్ మీడియాలో విస్త్రతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నేడు సిద్దిపేట నియోజకవర్గం నుంచి రెండు వేల మంది యువకులు పాదయాత్రగా సభకు బయలుదేరుతారు. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఎప్పటి కప్పుడు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలకు, పార్టీ బాధ్యులకు దిశానిర్దేశం చేశారు. రెండు లక్షలకు పైగా జనం కదిలేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.