సిద్దిపేట, ఏప్రిల్ 28( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రజతోత్సవ సభ విజయవంతం కావడంతో గులాబీ దండులో పుల్జోష్ నెలకొంది. మండుటెండను సైతం లెక్కచేయకుండా లక్షలాదిగా బీఆర్ఎస్ శ్రేణులు, అన్నివర్గాల ప్రజలు సభకు పోటెత్తారు. దీంతో జన జాతరను తలపించింది. సిద్దిపేట- హన్మకొండ రహదారి ఆదివారం పూర్తిగా జనంతో నిండిపోయిన సంగతి తెలిసిందే.కాంగ్రెస్ పాలనపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడడంతో ప్రజలు పనులు సైతం పక్కన పెట్టి సభకు వచ్చారు.
మళ్లీ కేసీఆర్ సార్ సీఎం కావాలని ప్రజలు నినదించారు.కేసీఆర్ సార్ వస్తేనే తమ బతుకులు బాగు పడుతాయని సబ్బండ వర్గాల ప్రజలు విశ్వసిస్తున్నారు అనడానికి రజతోత్సవ సభకు వచ్చిన జనమే నిదర్శనంగా చెప్పవచ్చు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి లక్ష్యానికి మించి జనం వెళ్లారు. ప్రతి పక్షంలో ఉన్న పార్టీ సభకు ఇంత పెద్ద ఎత్తున జనం తరలివెళ్లడం మామూలు విషయం కాదంటూ ప్రజలు చర్చించుకున్నారు.
రజతోత్సవ సభ ఉద్యమ నాటి రోజులను గుర్తుకు తెచ్చింది. ఏ తొవ్వ చూసినా జన ప్రవాహం కనిపించింది. బస్సులు, లారీలు, డీసీఎంలు, కార్లు, జీపులు, బైకులు..ఇలా లెక్కకు మించిన వాహనాలతో రోడ్డు కిక్కిరిసిపోయి ట్రాఫిక్‌కు ఇబ్బంది ఏర్పడింది. సిద్దిపేట -హన్మకొండ రహదారి గుండా ఎల్కతుర్తికి వెళ్లే వాహనాలతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు హుస్నాబాద్ దాటిన తర్వాత కారు ఆపి స్వయంగా ట్రాఫిక్ క్ల్లియర్ చేసి వాహనాలను పంపించారు.
సిద్దిపేట రంగధాంపల్లి చౌరస్తా వద్ద, బాబుజగ్జీవన్ కూడలి వద్ద స్వయంగా బీఆర్ఎస్ నేతలు ట్రాఫిక్‌ను క్లియర్ చేసి వాహనాలను ఎల్కతుర్తి సభకు పంపించారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు బీఆర్ఎస్ నేతలు సిద్దిపేట మున్సిపల్ ఛైర్మన్ కడవేర్గు రాజనర్సు, నేతలు మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, వంగ తిరుమల్ రెడ్డి ఇతర బీఆర్ఎస్ నేతలు దగ్గర ఉండి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఐదారు గంటలు ఎండను సైతం లెక్క చేయకుండా వారు ట్రాఫిక్‌ను క్లీయర్ చేశారు.
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు అడుగడుగునా పోలీసులు అడ్డంకులు సృష్టించారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేయడంలో పోలీసులు పూర్తిగా చేతులెత్తేశారు. ఒకరిద్దరు ట్రాఫిక్ పోలీసులు మాత్రమే అక్కడే ఉన్నారు. ఉమ్మడి మెదక్, నిజమాబాద్ జిల్లాల నుంచి వచ్చిన జనం రజతోత్సవ సభా స్థలికి చేరుకోలేక పోయారు.వారంతా హుస్నాబాద్ నుంచి తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ మార్గం గుండా పోయిన దాదాపుగా రెండు లక్షలకు పైగా జనం సభకు వెళ్లకుండానే తిరుగు పయనం అయ్యారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేసిన నాయకులు, కార్యకర్తలకు హృదయ పూర్వక ధన్యవాదాలు. సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి. ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుట్టిం ది. అడుగడుగునా పోలీసుల ఆంక్షలు, నిర్బంధాలు ప్రయోగించింది ఈ దుర్మార్గ సరారు. సభా స్థలికి కార్యకర్తలు చేరకుండా 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ చేశారు. కరీంనగర్, సిద్దిపేట, హుస్నాబాద్ దారుల్లో వచ్చే వాహనాలను ఎకడికకడ అడ్డుకున్నారు.
ట్రాఫిక్ జాం పేరిట సాక్షాత్తు పోలీసులే దగ్గరుండి వందలాది వాహనాలను తిప్పి పంపారు. ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాల నుంచి వచ్చే దాదా పు1000 పైగా వాహనాలను హుస్నాబాద్ దాటి న తర్వాత కొత్తపల్లి నుంచి యూటర్న్ చేసి తిరిగి సిద్దిపేట వైపు మళ్లించారు. కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు పటాపంచలు చేశారు. సభను విజయవంతం చేసిన బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు, టీవీల్లో లక్షల సంఖ్యలో వీక్షించిన వారందరికీ ధన్యవాదాలు.
– తన్నీరు హరీశ్‌రావు,మాజీ మంత్రి