తొగుట: రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. వెంకట్రావుపేటలోని ఎఫ్పీసీ కేంద్రం వద్ద యూరియా కోసం బారులు తీరిన రైతులతో ఆయన మాట్లాడారు. యూరియా లేకపోవడంతో పంట చేల ఎదుగుదల ఆగిపోయిందని, కేసీఆర్ హయాంలో యూరియా కొరత లేదని, కాంగ్రెస్ హయాంలో గోస పడుతున్నామని రైతులు కన్నీరు పెట్టుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యూరియా కోసం రైతులు గోస పడుతున్నా రేవంత్ సర్కార్‌కు చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. రైతుకు బస్తా యూరియా కూడా ఇవ్వడం లేదని, ఇదేనా మార్పు అని ఆయన ప్రశ్నించారు. ఆధార్ కార్డు, పాస్ బుక్‌లతో గంటల తరబడి నిలబడుతున్న రైతులకు ఓటిపీ పేర ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లలో కేసీఆర్ హయాంలో ఎరువులు, విత్తనాలకు ఇబ్బంది లేదని, ప్రతి మండలానికి పుష్కలంగా అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ఎరువుల కొరత తీర్చని పక్షంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు.