Kotha Prabhaker Reddy | మిరుదొడ్డి (అక్బర్పేట-భూంపల్లి), జూలై 4 : ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా ప్రభుత్వ దవఖానాలను పట్టించుకోకుండా గాలికి వదిలేశారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం అక్బర్పేట-భూంపల్లి మండలం భూంపల్లిలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రహారీ గోడ నిర్మాణం కోసం భూమి పూజ చేసి రికార్డులను పరిశీలన చేసి ప్రసవాలు ఈ దవాఖానలలోనే జరిగే విధంగా చూడాలని వైద్యులకు సూచించారు. అనంతరం ప్రాథమిక, జడ్పీ పాఠశాలలను తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడి జడ్పీ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి మెదక్ జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా ఏ ఒక్క నాడు కూడా వైద్య సిబ్బందితో రివ్యూ నిర్వహించిన పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఎప్పటికప్పుడూ వైద్యులకు సూచనలు సలహాలు చేస్తూ ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు సర్కార్ దవాఖాల్లో సరైన వైద్యం అందడం లేదు, దవాఖానాల్లో మందుల్లేవు.. ఏమి లేవు… కాంగ్రెస్ సర్కార్ ఫెయిల్ అయ్యింది పదవులను సక్రమంగా నిర్వహించని జిల్లా మంత్రులు తమ పదవులను వదిలి వేసి వేరే వారికి ఇవ్వాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో పల్లెలకు ఆర్టీసీ బస్సులు కరువు
కాంగ్రెస్ ప్రభుత్వం నిత్యం పత్రికల్లో మేము ఏమో చేశామంటూ.. డబ్బాలు కొట్టుకోవడమే తప్పా.. చేసింది శూన్యము. దుబ్బాకలో ఆర్టీసీ బస్సు డీపోలో 15 బస్సులు మాత్రమే ఉండడంతో ఏ ఒక్క ఊరుకు కూడా బస్సులు వెళ్లడం లేదన్నారు. ప్రయాణం సాగించడానికి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దుబ్బాక డిపోలో 70 బస్సులు ఉంటేనే ప్రతి పల్లెకు బస్సులు వెళ్లే ఆస్కారం ఉంటుందన్నారు. చెడిపోయిన, తూకానికి అమ్మే బస్సులను పల్లెలకు పంపుతున్నారు.. ప్రమాదాలు జరిగితే దానికి ఎవ్వరూ బాధ్యత వహిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దుబ్బాక డిపోకు నూతన బస్సులు పంపాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు వినతి పత్రం అందజేస్తే నిధులు లేవుసార్.. ఎక్కడ నుంచి బస్సులను పంపాలని అంటూ సజ్జనార్ అన్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు సకాలంలో ఎరువులు కూడా నేడు అందడం లేదన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అక్బర్పేట-భూంపల్లి మండల అధ్యక్షుడు జీడిపల్లి రవి, బీఆర్ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకులు పంజాల శ్రీనివాస్ గౌడ్, నాయకులు నరేశ్, ప్రభాకర్, మల్లికార్జున యాదవ సంఘం అధ్యక్షుడు ఎల్లం, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.