సిద్దిపేట అర్బన్, డిసెంబర్ 30: ప్రపంచంలో హాని కలిగించని వ్యసనం ఏదైనా ఉంది అంటే అది చదువు మాత్రమేనని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు సోమవారం ఉత్తరం ద్వారా టెన్త్ విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు. మార్చిలో జరిగే టెన్త్ వార్షిక పరీక్షలకు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి చదివించాలని హరీశ్‌రావు ఉత్తరంలో పేర్కొన్నారు.
చదువును నమ్ముకున్న వా రంతా తమ ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేసుకున్నారని పేర్కొన్నారు. పేద కుటుంబాల్లో జన్మించి దేశాలను పాలించే స్థాయికి ఎదిగిన వారు కొందరైతే, నేటి సాంకేతిక యుగానికి సంస్కరణలు రచించిన వారు ఇంకెందరో ఉన్నారని, ప్రణాళికాబద్ధమైన చదువు మన తలరానే మారుస్తుందనడానికి ఎన్నో సజీవ సాక్ష్యాలు ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా మాజీమంత్రి హరీశ్‌రావు ఉత్తరంలో ఇలా రాశారు.
మరి కొద్ది రోజుల్లో మీ పిల్లలు టెన్త్ పరీక్షలు రాయబోతున్నారు. వారి చదువులో ఇది అత్యంత కీలకమైన ఘట్టం. ఇది మంచి మార్కులతో గట్టెక్కితేనే ఉన్నత చదువుల దిశగా ముందడుగు వేసే అవకాశం ఉంటుంది. లేదంటే మీరు ఇన్నాళ్లు పడి న కష్టానికి, మీ పిల్లల చదువుకు ఎలాంటి అర్థం ఉండదన్నారు. మీ పిల్లలు తమ చదువుల్లో విజ యం సాధించాక మీరు ఇచ్చే అభినందన కన్నా మీ పిల్లలు పరీక్షలు రాసే ముందు మీరు తీసుకునే ప్రత్యేక శ్రద్ధ ఎంతో ముఖ్యం.
అందుకే వార్షిక పరీక్షలు ముగిసేదాకా పిల్లలపై దృష్టి పెట్టాలి. ముఖ్యం గా సెల్ఫోన్లకు దూరంగా ఉంచండి. విందులు, వినోదాలు, ఫంక్షన్లు, సినిమాలు, టీవీల జోలికి వెళ్లకుండా చూడండి. మీ ఇంటికి సంబంధించిన పనులను కూడా చెప్పవద్దు. ఈ పోటీ ప్రపంచంలో సాదాసీదాగా కాకుండా ప్రతిభను చాటితేనే మంచి అవకాశాలు వస్తున్నాయని, మీ ఆశలకు, మీ పిల్లల ఆశయాలకు వారధిగా నేను నిలవాలని, నాలుగేండ్లుగా సిద్దిపేట నియోజకవర్గంలో పదో తరగతి విద్యార్థులంతా అత్యధిక మార్కులు సాధిస్తున్నారు.
నూటికి నూరు శాతం పాసవుతున్నారు. ప్రతిష్టాత్మకమైన బాసర ట్రిపుల్ ఐటీ విద్యాసంస్థల్లోనూ 169 మంది సిద్దిపేట నియోజకవర్గ విద్యార్థులు గతేడాది సీట్లు సాధించడం గర్వకారణం. ఉచిత ఇంజినీరింగ్ విద్యతోపాటు మంచి ఉద్యోగాలను దక్కించుకుంటున్నారు. మీ పిల్లలు మంచి మార్కులతో పాస్ కావాలనేదే నా ఆకాంక్ష. నా తపన. నా వంతుగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులతో పాటు అల్పాహారం ఏర్పాటు చేస్తున్నాను. జిల్లా విద్యాధికారి నుంచి మీ పిల్లలకు చదువు చెప్పే ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులతో కూడా సమీక్షలు నిర్వహిస్తాను.
వారి స్కూళ్లలో సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఒక్క మార్కు కూడా తగ్గకుండా డిజిటల్ కంటెం ట్ ద్వారా ప్రతి సబ్జెక్ట్‌పై అవగాహన కల్పిస్తున్నాం. అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిచిన సిద్దిపేట నియోజకవర్గ విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో కూడా ఆదర్శంగా నిలవాలనేదే నా తాపత్రాయం. ప్రజాప్రతినిధిగా, మీ కుటుంబంలో ఒకడిగా నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. మీరు కూడా మీ పిల్లలను బాగా చదివించండి. చదువుతో పాటు చేతిరాత చక్కగా ఉండేలా చూడండి. ఇక మీ పిల్లల భవిష్యత్ మీ చేతుల్లోనే ఉంది. కష్టంగా కాకుండా ఇష్టంగా చదివించాలని, మీ పిల్లల బం గారు భవితకు బాటలు వేయాలని ఉత్తరం ద్వారా హరీశ్‌రావు విద్యార్థుల తల్లిదండ్రుల్లో చైతన్యం తెచ్చారు.