కొండపాక(కుకునూరుపల్లి), నవంబర్ 30: నిజంగా ఈరోజు నా జన్మ ధన్యమైందని… గుండె జబ్బులతో బాధపడే చిన్నారులకు ఆపరేషన్ చేసి పునర్జన్మను ప్రసాదిస్తున్న సత్యసాయి సంజీవని సేవలో నేను కూడా భాగమైనందుకు నా మనస్సు తృప్తితో నిండిపోయిందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం కొండపాక శివారులోని సత్యసాయి సంజీవని సెంటర్ ఫర్ చైల్డ్ హార్ట్‌కేర్ అండ్ రీసెర్చ్ సెంటర్‌ను రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, మాజీ ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, సత్యసాయి ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాస్‌రావుతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆరు రోజులుగా ఓపెన్ హార్ట్ సర్జరీ పూర్తి చేసుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులైన చిన్నారులను, వారి తల్లిదండ్రులను హరీశ్‌రావు ఆత్మీయంగా పలకరించారు.
వారి యోగక్షేమాలను, సత్యసాయి ట్రస్ట్ ద్వారా అందిన వైద్యసేవలు, సౌకర్యాలను తెలుసుకొని సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. మానవసేవే.. మాధవసేవ అనే మాటను మాటల్లోనే విన్న, కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నానని పేర్కొన్నారు. భగవాన్ మధుసూదనా సాయి, ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాసరావు, కేవీ రమణాచారి విజ్ఞప్తి మేరకు కళాశాల వార్షికోత్సవానికి వచ్చానని, అదే సమయంలో సత్యసాయి ట్రస్ట్ ద్వారా వైద్యసేవలను అందించాలని భగవాన్ సత్యసాయిని కోరానని తెలిపారు.
గుండె జబ్బులతో బాధపడే చిన్నారుల కోసం వైద్యం అందించే దవాఖానను ఏర్పాటు చేయాలని చేసిన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని దేశంలో ఐదో చైల్డ్ కేర్ అండ్ రీసెర్చ్ సెంటర్‌ను ఇక్కడ నిర్మించారన్నారు. అప్పుడు ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రిగా ఉన్న నేను నా వంతుగా దవాఖానకు అవసరమైన అనుమతులు ఇప్పించడంతో పాటు, నా శక్తి మేరకు భాగస్వామిగా అయ్యానన్నారు. అలాంటి దవాఖాన నేడు పిల్లల పాలిట సంజీవనిగా మారిందని హర్షం వ్యక్తం చేశారు. ఇంత గొప్ప అనుభూతి ఏ పదవిలో కలుగలేదని, తనకు ఇంత అదృష్టాన్ని కలుగజేసిన భగవాన్ మధుసూదనా సాయికి రుణపడి ఉంటామన్నారు.
దవాఖాన ఏర్పాటుకు కృషి చేసిన మాజీ ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారిని హరీశ్‌రావు అభినందించారు. అంతకుముందు ఆనంద నిలయం ఆవరణలో ఉన్న ఉమా మహేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో సుడా మాజీ చైర్మన్ మారెడ్డి రవీందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీలు బొద్దుల కనకయ్య, రాధాకిషన్‌రెడ్డి, గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, ఈజీఎస్ స్టేట్ మాజీ కౌన్సిల్ సభ్యురాలు కోల సద్గుణారవీందర్, రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు దేవీరవీందర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నూనె కుమార్‌యాదవ్, రైతుబంధు మాజీ మండల కో ఆర్డినేటర్ ర్యాగల దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.