సిద్దిపేట, నవంబర్ 17: అన్నదానానికి మించిన దానం మరొకటి లేదని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట ప్రభుత్వ దవాఖాన వద్ద ఇతిహాద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అన్నదాన కార్యక్రమం 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన హాజరై అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ఆకలితో అలమటిస్తున్న వారికి కడుపునిండా అన్నం పెట్టి నిరుపేదలకు సేవ చేయడం గొప్పవిషయమన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆపదలో దవాఖానకు వచ్చే ఎంతోమంది పేదల కడుపునిండా అన్నం పెట్టే కార్యక్రమం వెయ్యి రోజుల నుంచి ఇతిహాద్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అతిక్ అహ్మద్ నిర్వహించడం చాలా మంచిపని అని ఫౌండేషన్ సభ్యులను అభినందించారు.
ఇంట్లో పుట్టినరోజు వేడుకలు జరుపుకోకుండా ఆవనరులను పుణ్యకార్యానికి వినియోగించడం వారి నిబద్ధతకు నిదర్శనమన్నారు. పేదలకు అన్నం పెట్టి వారి ఆకలి తీర్చడం వారి నిస్వార్థ సేవకు అద్దం పడుతుందన్నారు. గ్రామాల నుంచి పేదలు దవాఖానకు వస్తున్నారని వారికి అన్నం పెట్టడం సంతోషకరమన్నారు. బైబిల్, ఖురాన్, భగవద్గీత అన్ని గ్రంథాలు కూడా మానవసేవయే మాధవసేవ అని బోధించాయన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అతిక్ అహ్మద్, ఫౌండేషన్ సభ్యులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.