మెదక్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : శాంతి, కరుణ, క్షమాగుణం నేర్పే క్రీస్తు బోధనలు మానవాళికి అనుసరణీయమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మెదక్ చర్చి శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం మెదక్ చర్చిని ఆయన సందర్శించారు. సీఎస్ఐ ఇన్చార్జి బిషప్ రెవరెండ్ రూబెన్ మార్క్ ప్రత్యేక ప్రార్థన చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ….ప్రజలందరికీ సుఖ శాంతులు కలగాలని ఆయేసును ప్రార్థిస్తున్నానని చెప్పారు.
మెదక్ చర్చి వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని, పేరు పేరునా ప్రతి ఒకరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. వందేళ్లుగా ఆసియాలోనే రెండో అతిపెద్ద క్రైస్తవ పుణ్యక్షేత్రంగా మెదక్ చర్చి వర్ధిళ్లుతోందని గుర్తు చేశారు. చర్చి నిర్మాణాన్ని ఇంగ్లాండ్‌కు చెందిన రెవరెండ్ చార్లెస్ వాకర్ ఫాస్నెట్ 1914 లో ప్రారంభించారని, 1924 డిసెంబర్ 25న పూర్తయ్యిందని తెలిపారు. వందేళ్ల శతాబ్ది ఉత్సవాల్లో చార్లెస్ వాకర్ ఫాస్నెట్ మనువడు పాల్గొనడం ఆనందంగా ఉం దన్నారు. చారిత్రాత్మకమైన చర్చి మన మెదక్ జిల్లాలో ఉండటం మనకే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రానికి ఎంతో గర్వకారణమన్నారు.
మీ అందరికీ తెలుసు కేసీఆర్ ప్రభుత్వం పోయి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడా ది పూర్తయిందన్నారు. గత తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ క్రిస్టియన్లకు ఏం చేశారు? ఎంత బాగా చూసుకున్నారో మీ అందరికీ తెలుసునని గుర్తు చేశారు. క్రిస్మస్ను రాష్ట్ర పండుగగా అధికారికంగా ప్రకటించి ఘనంగా నిర్వహించారన్నారు. క్రిస్మస్ను అధికారికంగా జరిపిన ఒకే ఒక నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని గుర్తు చేశారు. క్రిస్మస్ డే మరుసటి రోజు జరుపుకొనే బాక్సింగ్ డేను సెలవుగా ప్రకటించారని పేర్కొన్నారు. ప్రతి క్రిస్మస్ పండుగ రోజు పేద క్రిస్టియన్లకు గిఫ్టులు పంపిణీ చేశారని, కేసీఆర్ ఒక మతమని కాదు, హిందూ, ముస్లిం, క్రిస్మస్, సికు ఇలా అన్ని మతాలను సమానంగా గౌరవించి, వారు సంతోషంగా జీవించేలా చూశాడని చెప్పా రు.
అన్ని వర్గాలు బాగున్నాయి కాబట్టే హైదరాబాద్, తెలంగాణ భిన్నత్వంలో ఏకత్వం అనడానికి నిదర్శనంగా నిలుస్తున్నదన్నారు. అనంతరం చర్చి ఆవరణలోక్రిస్మస్ కేక్‌ను ఆయన కట్ చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రాగౌడ్, ఏఎంసీ మాజీ చైర్మన్లు బట్టి జగపతి, ఆకిరెడ్డి కృష్ణారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్‌గౌడ్, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.