సిద్దిపేట, జూలై 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):శాసనసభ సమావేశాల్లో సిద్దిపేట ని యోజకవర్గంలో నెలకొన్న సమస్యలు, ఆగిన అభివృద్ధి పనుల గురించి స్థానిక ఎమ్మెల్యే హరీశ్‌రావు లేవనెత్తారు. వీటిని సోమవారం స్పీకర్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. సిద్దిపేట నియోజకవర్గ సమస్యలపై కట్ మో షన్ సమయంలో అసెంబ్లీలో ప్రస్తావించారు. గత ప్రభుత్వం పలు అభివృద్ధి పనులకు ప్రత్యే క నిధులు మంజూరు చేసిందన్నారు. ఆ నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు.
కోమటి చెరువుకు మరింత పర్యాటక శోభ తెచ్చేలా రూ.15 కోట్లతో నిర్మిస్తున్న శిల్పారా మం పనులు నిలిపి వేశారని, వెంటనే పనులు ప్రారంభించి పూర్తిచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లాకేంద్రంలో మెడికల్ కాలేజ్ అనుబంధంగా నిర్మించిన 1000 పడకల దవాఖాన పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయని, పూర్తిచేసి ప్రజలకు వైద్యసేవలు అందించాలన్నారు. బీఆర్ఎస్ హయాంలో దవాఖాన ప్రారంభించుకున్నామని, మిగిలిన పనులు నేపథ్యంలో ప్రస్తుతం నడుస్తున్న దవాఖానను వెయ్యి పడకలకు అప్‌గ్రేడ్ చేయలేకపోయామని, ఈ పనులు పూర్తయితే పూర్తిస్థాయి దవాఖాన అందుబాటులోకి వచ్చి రోగులకు మెరుగైన వైద్యసేవలు అందుతాయని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు.