సిద్దిపేట/సిద్దిపేట అర్బన్, నవంబర్ 29: సిద్దిపేట పట్టణంలో శుక్రవారం దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహించారు. సిద్దిపేట శివారులోని పొన్నాల వద్ద బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీశ్ రావు, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ, భూపతి రెడ్డి, మనోహర్ రావు, కర్ర శ్రీహరి, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలకు పార్టీ నుంచి బీమా చెకులు అందజేశారు.
అంతకుముందు ప్రశాంత్ నగర్‌లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. సిద్దిపేటలోని రంగధాంపల్లి చౌరస్తా వద్ద అమరవీరుల స్తూపం వద్ద పూలుచల్లి అమరులకు నివాళులర్పించారు. పొన్నాల వద్ద బీఆర్ఎస్ కార్యాలయంలో కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే హరీశ్‌రావుతో పాటు కొత్త ప్రభాకర్ రెడ్డి, యాదవ రెడ్డి, ఇతర నాయకులు క్షీరాభిషేకం నిర్వహించారు. సందర్భంగా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించి నాటి ఉద్యమ స్మృతులను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమం అనంతరం కార్యకర్తలకు హరీశ్‌రావు స్వయంగా భోజనం వడ్డించారు. వచ్చిన కార్యకర్తలతో కలిసి సెల్ఫీలు దిగారు.