ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన అన్నపూర్ణ పథకం పేదల పాలిట వరంగా మారనున్నది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల మ్యానిఫెస్టోను ప్రకటించారు. మ్యానిఫెస్టోలో ప్రకటించిన అన్నపూర్ణ పథకంపై మెదక్ జిల్లాలోని పేదలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పేదల దొడ్డు బియ్యం కష్టాలు పూర్తిగా తొలిగిపోనున్నాయి. ప్రభుత్వంపై ఆర్థికభారం పడనున్నప్పటికీ సీఎం కేసీఆర్ పేదలకు సన్నబియ్యం అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని 520 చౌక ధరల దుకాణాల్లో 2,13,872 రేషన్ కార్డులపై ప్రతినెలా 3,626.803 టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. సన్నబియ్యం బువ్వ పెడతామంటున్న కేసీఆర్‌ను మరోసారి సీఎంను చేస్తామని పేదలు ఆనందంగా చెబుతున్నారు.
మెదక్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): పేదలకు దొడ్డుబియ్యం బదులు సన్నబియ్యం పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నది. సన్న రకాల సాగు ప్రోత్సహించడం, వ్యూహాత్మకంగా రైతులతో నియంత్రిత సాగు చేయిస్తుండడం సన్నబియ్యం పంపిణీ కోసమే. ప్రజా పంపిణీ వ్యవస్థతో ఇప్పటికే పేదలకు రూపాయికి కిలో బియ్యం పథకాన్ని ఉచితంగా అమలు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోలో పేదలకు రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ చేసేందుకు అన్నపూర్ణ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పథకం ఏప్రిల్- మే నుంచి సన్నబియ్యం ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో మెదక్ జిల్లాలో 2.13 లక్షల కార్డులదారులు లబ్ధిపొందనున్నారు.
మెదక్ జిల్లాలో 2,13,872 కార్డులు
మెదక్ జిల్లాలో 520 రేషన్ షాపులున్నాయి. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సన్నబియ్యం పథకం కింద మెదక్ జిల్లాలోని 2,13,872 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. ఇందులో 13,857 అంత్యోదయ కార్డులు, 1,99,948 ఆహార భద్రత కార్డులున్నాయి. అన్నపూర్ణ కార్డు కలిగి ఉన్న వారు 67 మంది ఉన్నారు. వీరికి ప్రతి నెలా 3,626.803 మెట్రిక్ టన్నుల బి య్యం సరఫరా అవుతున్నది. ప్రస్తుత సీజన్లో ఉత్ప త్తి అయిన ధాన్యం చేతికొచ్చాక, సన్నబియ్యం పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. దొడ్డు బియ్యం స్థానంలో సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం పెడుతున్నది. ఇందుకు ప్రభుత్వం ఈ-టెండర్లు పిలిచి రైస్‌మిల్లర్ల నుంచి కిలోకు రూ.32.50 చొప్పున వెచ్చించి కొనుగోలు చేస్తున్నది. దొడ్డు బియ్యం ధరతో పోలిస్తే సన్నబియ్యం 23 పైసలు తకువ ధరకే లభిస్తున్నాయి.
ఫొర్టిఫైడ్ రైస్‌తో రక్తహీనతకు చెక్..
పేదల్లో రక్తహీనతకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రజా పంపిణీలో భా గంగా వినియోగదారులకు అందిస్తున్న సాధారణ రేషన్ బియ్యానికి బదులు పోషకాలు గల బలవర్ధక బియ్యం (ఫోర్టిఫైడ్ రైస్) పంపిణీ చేస్తున్నది. గురుకులాలు, ప్రభుత్వ హాస్టళ్లు, మధ్యాహ్నా భోజన పథకాని కీ ఫోర్టిఫైడ్ సన్నబియ్యాన్నే సరఫరా చేస్తున్నది. జిల్లాలోని గురుకులాలు, మధ్యాహ్న భోజన పథకం, అం గన్వాడీలకూ సన్నబియ్యాన్నే పంపిణీ చేస్తున్నారు.
బియ్యం మాఫియా ఆగడాలకు చెక్
రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీతో బియ్యం మాఫియాకూ చెక్ పెట్టొచ్చని ప్రభుత్వం భావిస్తున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ డిపోల ద్వారా పంపిణీ చేసే బియ్యాన్ని 25 శాతం మంది లబ్ధిదారులు మాత్రమే తింటున్నట్లు గతంలో నిర్వహించిన ఒక సర్వేలో తేలింది. మిగిలిన 75 శాతం పేదల బియ్యం బ్లాక్ మారెట్‌కు తరలిపోతున్నది. రేషన్ షాపులో రూపాయికి కిలో బియ్యం కొంటున్న వినియోగదారుడి నుంచి బియ్యం వ్యాపారులు కిలోకు రూ.10 చొప్పున కొంటున్నారు. ఆపై మధ్య దళారీకి కిలో రూ.15 చొప్పున అమ్ముతున్నారు. వారు రూ.4 లాభం చూసుకుని, ఆ బియ్యాన్ని రైస్ మిల్లర్‌కు రూ.19 చొప్పున విక్రయిస్తున్నారు. ఆ బియ్యాన్ని రైస్‌మిల్లులో రీ-సైక్లింగ్ చేసి ప్యాకింగ్ చేస్తే కిలోకు రూ.20.50 పైసల చొప్పున గిట్టుబాటు అవుతున్నది. ఈ నేపథ్యంలో ప్రజలు తినగలిగే బియ్యాన్నే పీడీఎస్ ద్వారా పంపిణీ చేస్తే ఇటువంటి సమస్యలన్నింటికీ పరిషారం లభిస్తుందనే ఆలోచనతో సీఎం కేసీఆర్ సన్న బియ్యం పథకానికి శ్రీకారం చుట్టారు.
సన్నబియ్యం.. మంచి నిర్ణయం
తెల్లరేషన్ కార్డు ఉన్న వారికి సన్నబియ్యం పంపిణీ చేస్తానని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చాలా మంచింది. ప్రజలందరి సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నడు. సన్నబియ్యం పంపిణీపై సీఎం చేసిన ప్రకటన ప్రతి ఒక్కరికీ సంతోషాన్నిచ్చింది. ఈ నిర్ణయంతో పేదలు కడుపు నిండా తింటారు.
– రెడ్డిశెట్టి రమాదేవి, తిప్పనగుల్ల, నిజాంపేట
పేదలకు కడుపు నిండా భోజనం
వ్యాపారాలు, ఉద్యోగాలు చేసే వాళ్లు సన్నబియ్యం తింటరు. అన్ని రకాల పంట పండించే రైతులు దొడ్డు బియ్యం తింటున్నారు. ఇప్పుడు రైతులు కూడా రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం అందించాలనే ఆలోచన చాలా బాగుంది. కూలీ నాలీ చేసుకునే పేదలు కడుపునిండా తింటారు. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
– అరుగు కిష్టయ్య, రైతు, వెల్దుర్తి
సన్నబియ్యం ఇవ్వడం అదృష్టం
ఉమ్మడి రాష్ట్రంలో రేషన్ బియ్యం కిలోకు రూ.5 చొప్పున ఇస్తుండే. సీఎం కేసీఆర్ వచ్చినంక కిలో బియ్యం రూపాయికే అని చెప్పి ఇప్పు డు ఫ్రీగా ఇస్తున్నడు. మా ఇంట్లో నలుగురం ఉంటాం. మాలాంటి గరీబోళ్లందరికీ సన్నబియ్యం ఇవ్వాలనుకోవడం నిజంగా మా అదృష్టం. మాలాంటి పేదల గురించి ఆలోచించేది సీఎం కేసీఆర్ ఒక్కరే. మూడోసారి ఆయనే సీఎం కావడం పక్కా. సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– తీగల లక్ష్మీనర్సయ్య, గూడురు, శివ్వంపేట
సన్నబియ్యం పేదలకు వరం
బీఆర్ఎస్ గెలిస్తే పేదలకు సన్నబియ్యం ఇస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించడం సంతోషంగా ఉంది. సన్నబియ్యం కొనుక్కుని తినాలంటే ఇబ్బందిగా ఉంది. రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం ఇవ్వడంతో మాలాంటి పేదోళ్లంతా కడుపునిండా తినగలుగుతాం. రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ చేసే నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్‌కు పేదలంతా రుణపడి ఉంటారు. సీఎం సారుకు ధన్యవాదాలు.
– మాసుల రాములు, నర్సాపూర్
సన్న బియ్యం.. హర్షణీయం
రేషన్ కార్డుపై సన్నబియ్యం ఇస్తామని సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోలో పెట్టడం హర్షణీయం. ఇప్పటికే స్కూళ్లు, కాలేజీల్లో చదువుకునే పిల్లలకు సన్నబియ్యంతో అన్నం పెడుతున్నారు. మార్కెట్లో సన్నబియ్యం కొని తినలేనంత ధర పెరిగింది. పండుగలప్పుడు సన్నబియ్యం కొనుక్కుంటున్నాం. ఇపుడు నిరు పేదలం కూడా సన్నబియ్యంతో రోజూ అన్నం తినే అవకాశం వచ్చింది. సంతోషం.
– బొల్లి శేఖులు, కొల్చారం