చేర్యాల, మార్చి 10: కాంగ్రెస్ సర్కారు తీసుకువచ్చిన కరువుతో చేర్యాల ప్రాంతంలో పంటలు ఎండిపోతున్నాయని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. సోమవారం బీఆర్ఎస్ బృందం చేర్యాలలో ఎండిపోయిన పంటలను పరిశీలించింది. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు ముస్త్యాల నాగేశ్వర్రావు, రైతు నాయకుడు అంకుగారి శ్రీధర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ మేడిశెట్టి శ్రీధర్, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ మంగోలు చంటి మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు అమలుకు సాధ్యంకాని హామీలిచ్చి వాటిని నేరవేర్చలేక ముఖం చాటేసిందన్నారు.
రైతాంగాన్ని ఆదుకోవాలనే ముందుచూపు రేవంత్ సర్కారుకు లేకపోవడంతో రాష్ట్రంలో సాగునీరు లేక చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు అడుగంటిపోయి రైతులు అన్నమో రామచంద్రా అంటున్నారని తెలిపారు. పంటలు ఎండిపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే స్పందించి మన ప్రాంతంలో ఉన్న తపాస్‌పల్లి రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలు తీసుకువచ్చి పంటలను కాపాడాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ పుర్మ వెంకట్‌రెడ్డి, యూత్ ఇన్చార్జి శివగారి అంజయ్య, టౌన్ సెక్రటరీ బూరగోని తిరుపతి గౌడ్, నాయకులు మంచాల కొండయ్య, బీరెడ్డి ఇన్నారెడ్డి, పాక పర్శరాములు, చింతల పర్శరాములు, పచ్చిమడ్ల మానస, యాట భిక్షపతి, అవుశర్ల కిశోర్ తదితరులున్నారు.