సంగారెడ్డి, మెదక్ న్యూస్ నెట్వర్క్, మార్చి 11; బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మెదక్, సంగాడ్డి జిల్లాలు భగ్గుమన్నాయి. బీఆర్ఎస్, జాగృతి ఆధ్వర్యంలో శనివారం జిల్లా, మండల కేంద్రాల్లో నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. బండి దిష్టిబొమ్మలను ఊరేగించి కూడళ్ల వద్ద దహనం చేశారు. ఆయన ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీలను చెప్పులతో కొడుతూ నిరసన తెలిపారు. సంజయ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పలు పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బండిని వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసి బీజేపీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. మహిళలపై ఆయన చేసిన వ్యాఖ్యలు సమాజం తలదించుకునేలా ఉన్నాయని మండిపడ్డారు. మహిళలకు భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు జాతీయ స్థాయిలో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే కేంద్ర ప్రభుత్వం ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు పంపి ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు.
జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళను అగౌరపర్చేలా మాట్లాడినందుకు సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో పలుచోట్ల ధర్నాలు, రాస్తా రోకోలు చేపట్టి, బండి సంజయ్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని, వెంటనే ఎమ్మెల్సీ కవితపై మాట్లాడిన మాటలను ఉపసంహరించుకొని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
‘బండి’ నోరు అదుపులో పెట్టుకో.. ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి
బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎమ్మెల్సీ కవితపై చేసిన అనుచిత మాటలకు నిరసనగా నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం నర్సాపూర్ బస్టాండ్ సమీపంలో బీఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టి, బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులను చూడలేకనే బీజేపీ నాయకులు కేసులు పెడుతున్నారని వెల్లడించారు. ఈడీ పెట్టిన అక్రమ కేసులకు మా వద్ద ఆధారాలు ఉన్నాయని, ఇలాంటి కేసులకు బీఆర్ఎస్ లొంగదని హెచ్చరించారు. ఎమ్మెల్సీ కవితపై చేసిన అసభ్యకర మాటలకు బండి సంజయ్ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీ కో-ఆప్షన్ మెంబర్ మన్సూర్, ఆత్మకమిటీ చైర్మన్ వెంకట్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పైడీ శ్రీధర్‌గుప్తా, మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమొద్దీన్, బీఆర్ఎస్వీ నాయకుడు సుధీర్‌రెడ్డి, ఇన్చార్జి ఎంపీపీ వెంకటనర్సింగరావు, పీఏసీఎస్ చైర్మన్ రాజుయాదవ్, జడ్పీటీసీ బాబ్యానాయక్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షుడు భిక్షపతి, ఎంపీటీసీ సంధ్యారాణి శత్రునాయక్, సర్పంచ్ వెంకటలక్ష్మి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
దిష్టిబొమ్మ దహనం
మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకుడు బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు దిష్టిబొమ్మ దహనం చేశారు. శనివారం చేనేత అభివృద్ధి చైర్మన్ చింతా ప్రభాకర్ ఆదేశాలతో సంగారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ అతిథిగృహం నుంచి కొత్త బస్టాండ్ వరకు బండి సంజయ్ దిష్టిబొమ్మ శవయాత్ర చేశారు. చెప్పులతో దేహశుద్ధి చేస్తూ, బండి డౌన్‌డౌన్ అంటూ నినాదాలతో దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ దేశంలో మహిళలకు భద్రత లేదనడానికి ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. బీజేపీ నాయకుడి వ్యాఖ్యలను ఉపసంహరించుకుని, బేషరుతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బొంగుల రవి, విజయేందర్‌రెడ్డి, డాక్టర్ శ్రీహరి యాదవ్, ఎంఏ హకీం, మందుల వరలక్ష్మి, హరికిషన్, సైదాపూర్ మల్లాగౌడ్, శ్రీధర్‌రెడ్డి, ఎన్ఆర్ఐ షకీల్, పెరుమాళ్ల నర్సింలు, కాసాల రాంరెడ్డి, మాజీ ఆత్మ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, సమద్, అమీర్, ఆజీమ్, గోవింద్ బాబాచారి, పరుశరాంనాయక్ తదితరులు పాల్గొన్నారు.
మహిళలను కించపరిస్తే నాలుక చీలుస్తాం
భగవద్గీత సాక్షిగా అన్ని నిజాలు మాట్లాడే బీజేపీ నాయకులు మహిళా బిల్లుపై ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో ధర్నా చేస్తే బండి సంజయ్ అనుచిత వాక్యలు చేయడం ఎంతవరకు సమంజసమని మహిళా జోలికొస్తే నాలుక చీలుస్తామని బీసీ సంఘం జాతీయ కార్యదర్శి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బీరయ్యయాదవ్ హెచ్చరించారు. శనివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కవితపై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని బేషరుతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న మహిళల అభివృద్ధి, సంక్షేమానికి పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టి ఆమోదించాలని డిమాండ్ చేయడం ప్రజాప్రతినిధుల లక్షణమన్నారు.
ఎమ్మెల్సీ కవితక్కకు క్షమాపణ చెప్పాలి
ఆడవారిని గౌరవించడం భారతీయ సంస్కృతికి నిదర్శనం. కానీ, సాంప్రదాయాలకు చరమగీతం పాడుతూ మహిళలపై ప్రతాపం చూపించే బీజేపీ నాయకుల మాటలు కించపరిచే విధంగా ఉన్నాయని జాగృతి రాష్ట్ర నాయకుడు పట్లోళ్ల శివశంకర్ పాటిల్ మండిపడ్డారు. శనివారం ఎమ్మెల్సీ కవితక్కపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
రాజకీయాల విలువలు తగ్గిపోయాయి!
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయాల విలువలు తగ్గిపోయాయని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. శనివారం జహీరాబాద్ పట్టణంలోని ఆర్అండ్బీ గృహం వద్ద ప్రధాన రోడ్డుపై బండి సంజయ్ దిష్టి బొమ్మ దహనం చేశారు. ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలకు వారు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మహిళలపై గౌరవం లేని వ్యక్తి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండడం దురదృష్టకరమని, వెంటనే బండి సంజయ్ ఎమ్మెల్సీ కవితకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జహీరాబాద్ పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు సయ్యద్ మోహినోద్దీన్, మాజీ అధ్యక్షుడు ఎండి.యాకుబ్, బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి, పట్టణ మహిళా అధ్యక్షురాలు మంజుల, నాయకులు నామ రవికిరణ్, ఇజ్రాయిల్ బాబీ, సత్యం ముదిరాజ్, మాజీ కౌన్సిలర్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు