పటాన్చెరు, నవంబర్15: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సంగారెడ్డి, పటాన్చెరు నియోజకవర్గాల బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. రంగారెడ్డి జిల్లా లగచర్లలో నిర్మించనున్న ఫార్మా కంపెనీ నిర్మాణానికి వ్యతిరేకంగా గళంవిప్పిన రైతులను అక్రమంగా అరెస్టు చేసి సంగారెడ్డి జిల్లా కంది జైలులో పెట్టిన సందర్భంగా రైతులను పరామర్శించి వారిలో ఆత్మవిశ్వాసం నింపేందుకు కేటీఆర్ పటాన్చెరు మీదుగా కంది వెళ్లారు.
ఈ సందర్భంగా పట్టణంలోని ఐబీ భవనం వద్ద బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై కేటీఆర్‌కు ఘనస్వాగతం పలికారు. పార్టీ శ్రేణులతో కలసి ఆదర్శ్‌రెడ్డి, మెట్టు కుమార్‌యాదవ్, కొలన్ బాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, శంకర్‌యాదవ్, కార్పొరేటర్ సింధు కేటీఆర్‌ను ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మహిళలు కేటీఆర్‌కు బొట్టుపెట్టి ఆహ్వానించారు. ముస్లిం మహిళలు కేటీఆర్ చేతికి ఇమామే జామిన్ కట్టి అభిమానం చాటుకున్నారు. ఐబీ బంగ్లా ఆవరణలోని తెలంగాణ తల్లి విగ్రహానికి కేటీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు.
జై తెలంగాణ, జైజై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేశారు. కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్‌రెడ్డి డౌన్డౌన్తో ఆ ప్రాంతం దద్దరిల్లింది. పార్టీ నాయకులను కేటీఆర్ అభిమానంతో పేరుపేరునా పలకరించడంతో వారిలో ఉత్సాహం రెట్టింపు అయింది. లగచర్ల రైతులను పరామర్శించేందుకు కంది వెళ్తున్నానని కేటీఆర్ పార్టీ శ్రేణులతో చెప్పి ముందుకు వెళ్లారు. ఈ సందర్భంగా పటాన్చెరు పార్టీ శ్రేణులు కేటీఆర్‌ను అనుసరించాయి. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తొంట అంజయ్యయాదవ్, వెంకటేశం గౌడ్, సోమిరెడ్డి, శ్రీధర్‌చారి, రాములుగౌడ్, అక్రం పాషా, వంగరి అశోక్ పాల్గొన్నారు.
కంది, నవంబర్ 15: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు శుక్రవారం కందిలో ఘన స్వాగతం లభించింది. లగచర్ల రైతులను అక్రమంగా అరెస్టు చేసి కంది సెంట్రల్ జైలుకు తరలించారు. జైలులో వారిని పరామర్శించేందుకు కేటీఆర్ బీఆర్ఎస్ నాయకులతో కలిసి వచ్చారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ నాయకులు, కార్యకర్తలతో కేటీఆర్‌కు స్వాగతం పలికారు. కాబోయే సీఎం కేటీఆర్ అంటూ జై తెలంగాణ నినాదాలు చేశారు. నాయకులు, కార్యకర్తలతో మాట్లాడిన కేటీఆర్ జైలుకు బయలుదేరారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, బీఆర్ఎస్ కంది మండల అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, నాయకులు నరహరిరెడ్డి, కాసాల బుచ్చిరెడ్డి, జైపాల్‌రెడ్డి, చిల్వెరి ప్రభాకర్, మామిళ్ల రాజేందర్‌తో పాటు పెద్దసంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
రామచంద్రాపురం, నవంబర్ 15: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు బీఆర్ఎస్ శ్రేణులు పటాన్చెరులో పెద్దఎత్తున స్వాగతం పలికారు. కేటీఆర్ సంగారెడ్డికి వెళ్తున్న విషయం తెలుసుకున్న కార్పొరేటర్ సింధూఆదర్శ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆర్సీపురం, భారతీనగర్ డివిజన్ల నుంచి, మాజీ సర్పంచ్ సోమిరెడ్డి ఆధ్వర్యంలో వైస్ చైర్మన్ రాములు గౌడ్, కౌన్సిలర్లు, నాయకులు తెల్లాపూర్ మున్సిపాలిటీ నుంచి పెద్దఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు పటాన్‌చెరుకు తరలివెళ్లారు.