నర్సాపూర్, ఫిబ్రవరి 3: కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ కలిసి ప్రజలకు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కాయని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఎద్దేవా చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలోని 1, 2వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థులు ఆరట్ల సంగీతామల్లేశం, హమీద్ తరపున మంగళవారం ఆమె ఇంటింటికీ తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. కేంద్రంలో ఇన్నేండ్లు బీజేపీ ఉండి ధరల నియంత్రణలో పూర్తిగా విఫలమైందన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఆకాశాన్నంటాయని, రెండుకోట్ల ఉద్యోగాలు ఇస్తామని, జీరో అకౌంట్లో రూ.15లక్షలు వేస్తామని ప్రజలను మోసం చేసిందని గుర్తుచేశారు. కిసాన్ సమ్మాన్ యోజన కూడా సరిగ్గా వేయడం లేదన్నారు. మెదక్ ఎంపీగా రఘునందన్‌రావు గెలిచినా నయా పైసా కూడా నర్సాపూర్ నియోజకవర్గానికి తీసుకురాలేదని విమర్శించారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఏకమై బీఆర్ఎస్ను ఓడించాలని చూస్తున్నాయని, ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏ ఇంటికి వెళ్లినా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, కేసీఆర్ ఉన్నప్పుడే న్యాయం జరిగిందని ప్రజలు చెబుతున్నారని గుర్తుచేశారు. కేసీఆర్ కిట్, న్యూట్రీషన్ కిట్, స్కాలర్షిప్ ఆగిపోయాయన్నారు. కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధ్ది, సంక్షేమ కార్యక్రమాలను నేడు ప్రజలు గుర్తుచేసుకుంటూ బీఆర్ఎస్ కారు గుర్తుకే ఓటువేస్తామని అంటున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభు త్వం కక్షసాధింపుగా కేసీఆర్, కేటీఆర్, హరీవ్రావుకు నోటీసులు ఇచ్చి ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. 1, 2వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థులు ఆరట్ల సంగీతామల్లేశం, హమీద్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె ఓటర్లను కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ అశోక్‌గౌడ్, మాజీ వైస్ చైర్మన్ నయీమొద్దీన్, జడ్పీ కో-ఆప్షన్ మాజీ సభ్యు డు మన్సూర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, నాయకులు గోపి, మాజీ సర్పంచ్‌లు సేనాధిపతి, రవి పాల్గొన్నారు.