సిద్దిపేట/మెదక్, ఫిబ్రవరి 13(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉద్యమాల పురిటిగడ్డ మెతకుసీమలో ఇతర పార్టీలకు చోటులేదని మరోసారి రుజువైంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జిల్లా కావడంతో ఆది నుంచి జిల్లా బీఆర్ఎస్కు అండగా నిలుస్తున్నది. ఈ మున్సిపల్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ జైత్రయాత్రను కొనసాగించింది. 19 మున్సిపాలిటీలకు 11 బీఆర్ఎస్ కైవసం చేసుకుంది.నర్సాపూర్‌లోనూ ఎక్స్అఫీషియో ఓట్లతో చైర్మన్ పీఠాన్ని గెలుచుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ ఫలితాలతో బీఆర్ఎస్ క్యాడర్లో జోష్ నెలకొంది.బీఆర్ఎస్ డిప్యూటీ లీడర్ తన్నీరు హరీశ్‌రావు విస్తృత ప్రచారం నిర్వహించి, కాంగ్రెస్ ప్రభు త్వం వైఫల్యాలను ఎండగట్టారు. స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ ప్రజలను ఆకట్టుకున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు సైతం విస్తృతంగా ప్రచా రం చేశారు. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని 19 మున్సిపాలిటీలకు 16 చోట్ల సభలు, కార్నర్ మీటింగ్‌ల్లో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఒక్కో మున్సిపాలిటీల్లో 3 నుంచి 5 వరకు కార్నర్ మీటింగ్‌ల్లో హరీశ్‌రావు పాల్గొన్నారు. కొన్ని మున్సిపాలిటీలను రెండుసార్లు చుట్టేసి వచ్చారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, పార్టీ ఇన్చార్జిలు, నాయకులు, కార్యకర్తలు అభ్యర్థులు విజయానికి శక్తివంచన లేకుండా కృషిచేశారు. దీంతో మెజార్టీ మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ మం త్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, బీజేపీ మ్ంర తులు, ఎంపీలు విస్త్రత ప్రచారం చేసినా వారికి భంగపాటు తప్పలేదు.
సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో అధికార కాంగ్రెస్‌కు పట్టణ ప్రజలు గట్టి గుణ పాఠం చెప్పారు. సిద్దిపేట జిల్లాలో 1, మెదక్ జిల్లాలో 1, సంగారెడ్డి జిల్లాలో 5 మున్సిపాలిటీలను మాత్రమే కాంగ్రెస్ గెలుచుకుంది. కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్, మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్ విస్తృత ప్రచారం నిర్వహించారు. రెండున్నరేండ్లలో ఏం చేశారని ఎన్నికల ప్రచారంలో మంత్రులను ప్రజ లు నిలదీశారు. హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇష్టారీతిగా వ్యవహరించారు. భారీగా తన అనుచరులతో మద్యం, డబ్బులు పంపిణీ చేయించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారు. బీఆర్ఎస్ అభ్యర్థులపై దాడులు చేయించారు. మెదక్ ఎమ్మెల్యే రోహిత్ మెదక్‌లో అధికారం అడ్డుపెట్టుకొని దాడులకు దిగారు. కారుతో గుద్దించడం తదితర పనులు చేయించారు. పైగా భౌతిక దాడులకు పాల్పడుతూ అక్రమ కేసులు పెట్టించారు. కాంగ్రెస్ నేతలు అధికార దుర్వినియోగం చేసినా ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారు. ఇక బీజేపీ ఏ మున్సిపాలిటీని కైవసం చేసుకోలేదు. 403 వార్డులకు కేవలం 32 వార్డులు మాత్రమే గెలుచుకుంది.
మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో బీజేపీ, ఎంఐఎం, స్వతంత్రులు అభ్యర్థులు కీలకంగా మారారు. 19 మున్సిపాలిటీల్లో కొన్ని చోట్ల హంగ్ వచ్చింది. అక్కడ వీరి పాత్ర కీలకంగా మారింది. అప్పుడే అధికార కాం గ్రెస్ పార్టీ రాయబేరాలకు తెరలేపింది. అధికారాన్ని అడ్డుపెట్టుకొని నయానో భయానో స్వతంత్రులను తన వైపు తిప్పుకోవడానికి ఎత్తులు వేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ ఎత్తులకు స్వతంత్రులు పెద్దగా స్పందించడం లేదని తెలుస్తోంది. అధికార పార్టీపైన ప్రజల్లో ఉన్న వ్యతిరేకతతో వారు అంతగా సానూకూలంగా స్పందించడం లేదని తెలుస్తోంది. ఈనెల 16న క్లారిటీ రానున్నది.
సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక, గజ్వేల్, చేర్యాల బల్దియాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మెదక్ జిల్లాలోని తూప్రాన్, మెదక్, సంగారెడ్డి జిల్లాలోని గడ్డపోతారం, గుమ్మడిదల, ఇంద్రేశం, ఇస్నాపూర్, జిన్నారం, జహీరాబాద్ మున్సిపాలిటీల్లో గులాబీజెండాను ఎగురవేసింది. నర్సాపూర్‌లో ఎక్స్ అఫీషియో ఓట్లతో మున్సిపాలిటీని కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా 19 మున్సిపాలిటీలకు 11 బీఆర్ఎస్ వశం చేసుకుంది. మరో ఒకటి రెండు మున్సిపాలిటీలను ఎక్స్అఫీషియో ఓట్లతో కైవసం చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 402 వార్డులకు అత్యధికంగా బీఆర్ఎస్ గెలుచుకుంది. సిద్దిపేట జిల్లాలో 72 వార్డులకు బీఆర్ఎస్ 33 వార్డుల్లో, 32 వార్డులు కాంగ్రెస్, 3 బీజేపీ , 4 ఇతరులు గెలుపొందారు. సంగారెడ్డి జిల్లాలోమొత్తం 256 వార్డులకు బీఆర్ఎస్ 102 వార్డులు, 116 వార్డులు కాంగ్రెస్, 16 వార్డులు బీజేపీ, 22 వార్డుల్లో విజయం సాధించారు. మెదక్ జిల్లాలో 75 వార్డులకు 32 వార్డులు బీఆర్ఎస్, 32 వార్డులు కాంగ్రెస్, 10 వార్డులు బీజేపీ, 01 వార్డు ఇతరులు విజయం సాధించారు.