గజ్వేల్, సెప్టెంబర్ 1: కాళేశ్వరం ప్రాజెక్టుపై వేసిన ఘోష్ కమిషన్ పేరుతో ఉద్యమనేత కేసీఆర్‌పై కాంగ్రెస్, బీజేపీ కుట్రలు చేస్తే తెలంగాణలో మరో ఉద్యమం తప్పదని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారిపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ధర్నాతో ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో రైతుల ఆత్మహత్యల నివారణ కోసం ప్రాజెక్టుల నిర్మాణం చేసి సాగునీళ్లు అందిస్తే పుష్కలంగా ధాన్యం పండిందని, దాంతో దేశంలోనే తెలంగాణకు అన్నపూర్ణగా పేరొచ్చిందన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లోని రైతులు కేసీఆర్ పాలనే బాగుందనే విషయాన్ని మాట్లాడుతుంటే జీర్ణించుకోలేక రేవంత్‌రెడ్డి కుట్ర చేస్తున్నాడని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో సీబీఐకి విచారణ కోసం అప్పగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పోరాటం చేస్తేకాని ప్రాజెక్టులో నీళ్లు నింపలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ఒకటి,రెండు ఫిల్లర్లు కుంగితే ప్రాజెక్టు మొత్తం కూలినట్లు చిత్రీకరించి కేసీఆర్, హరీశ్‌రావుపై నిందలు మోపుతూ రేవంత్‌రెడ్డి క్షణికానందాన్ని పొందుతున్నారన్నారు. యూరియా కొరతతో గ్రామాల్లోని రైతులు రోడ్లపైకి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల గోస పట్టడం లేదని దుయ్యబట్టారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం చేతకాక కేసీఆర్‌పై నిందలు మోపుతూ కమిషన్పేరుతో కుట్రలు చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, నేతలు దేవీ రవీందర్, జుబెర్పాషా, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు మధు, నవాజ్, కుమార్, మాజీ ఎంపీపీ పాంగుగౌడ్, జడ్పీటీసీ పంగ మల్లేశం, నాయకులు అర్జున్‌గౌడ్, కృష్ణారెడ్డి, విరాసత్ అలీ, ప్రశాంత్, రమేశ్‌గౌడ్, కృష్ణాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.