గజ్వేల్, జూన్ 11: రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బుధవారం హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్లో పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యేందుకు బయలుదేరుతారనే విషయం తెలుసుకున్న గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రానికి చేరుకున్నారు.
బీఆర్కే భవన్‌కు వెళ్లేందుకు వాహనాలతో వ్యవసాయక్షేత్రానికి తరలివచ్చిన కార్యకర్తలు కేసీఆర్‌తో పాటే భారీ కాన్వాయ్‌తో హైదరాబాద్‌కు వెళ్లారు. ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రం నుంచి బయలుదేరిన వాహనశ్రేణి మర్కూక్, గౌరారం, ములుగు, వంటిమామిడి మీదుగా భారీ కాన్వాయ్‌తో వెళ్లింది. ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రం నుంచి రాజీవ్ రహదారి వెంబడి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి వ్యవసాయక్షేత్రానికి కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
కేసీఆర్ కాన్వాయ్ వెంబడి మాజీ మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎంపీ సంతోష్‌రావు, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డిలతో పాటు తదితరులు తరలివెళ్లారు. ఉదయం నుంచే గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అవలంభిస్తున్న నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా ఫ్లకార్డులతో వ్యవసాయక్షేత్రం వద్ద నినాదాలు చేస్తూ కార్యకర్తలు కేసీఆర్‌కు మద్దతుగా నిలిచారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి కేసీఆర్ అభిమానులు, రైతులు సైతం తరలివచ్చారు. అనుకున్న సమయానికి బీఆర్కే భవన్‌కు చేరుకునేలా ముందుగానే ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రం నుంచి కేసీఆర్ బయలుదేరారు. కేసీఆర్ కాన్వాయ్‌కు గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని గజ్వేల్, మర్కూక్, ములుగు, జగదేవ్‌పూర్, కొండపాక, కుకునూర్‌పల్లి మండలాల బీఆర్ఎస్ శ్రేణుల వాహనాలు అనుసరించారు.