సంగారెడ్డి జనవరి 24(నమస్తే తెలంగాణ): మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ వినూత్నంగా అడుగులు వేస్తోంది. రాబోయే రెండు మూడు రోజుల్లో మున్సిపల్ ఎన్నికల నోటిఫకేషన్ రావచ్చనే ప్రచారం రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది. మిగతా పార్టీల కంటే ముందుగానే బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతున్నది. సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ పట్టుదలగా ఉంది. మాజీ మంత్రి, శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు మున్సిపాలిటీల్లో గెలుపు కోసం వ్యూహరచన చేస్తున్నారు.
ఇందులో భాగంగా మొదట 11 మున్సిపాలిటీలకు సమన్వయకర్తలను నియమించారు. అనంతరం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మున్సిపల్ సమన్వయకర్తలతో సమావేశం నిర్వహించి మున్సిపల్ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. రిజర్వేషన్లకు అనుగుణంగా అభ్యర్థుల ఎంపిక, ప్రచారం తదితర అంశాలపై బీఆర్ఎస్ దృష్టిపెట్టింది. రెండేండ్ల పాలనలో కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ నిలబెట్టుకోలేదు. పట్టణాల్లో అభివృద్ధ్దిని రేవంత్ సర్కారు పడకేసింది. దీంతో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లి ఓటర్ల మద్దతు కూడగట్టడంపై బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా మాజీ మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ నాయకులు ప్రచారం మొదలుపెట్టారు.
అందోల్-జోగిపేట మున్సిపాలిటీల్లో బాకీకార్డులతో ప్రచారం
అందోల్-జోగిపేట మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ లక్ష్యంగా పెట్టుకున్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో అందోల్-జోగిపేట మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్ దక్కించుకుంది. ఈదఫా ఎన్నికల్లో సైతం చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ పట్టుదలగా ఉన్నారు. ఇందులో భాగంగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని క్యాడర్‌కు పిలుపునిచ్చారు. అందోల్-జోగిపేట మున్సిపాలిటీల్లోని బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ బాకీ కార్డులతో జోరుగా ప్రచారం చేస్తున్నారు.
కేసీఆర్ పాలనలో అందోల్-జోగిపేట మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. మున్సిపాలిటీలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించడంతోపాటు వీధిలైట్లు, తాగునీరు సరఫరా చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో అందోల్-జోగిపేట మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు కొరవడ్డాయి. మంత్రి దామోదర్ రాజనర్సింహ అందోల్ మున్సిపాలిటీని పట్టించుకోవడం లేదని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో మంజూరు చేసిన టీయూఎఫ్ఐడీసీ నిధులను తిరిగి మంజూరు చేయించి రోడ్లు వేయిస్తున్నారు తప్పా మంత్రి దామోదర్ అందోల్ మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు ఇవ్వడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు చేయకపోవటం, రేవంత్‌రెడ్డి ప్రజలకు ఇచ్చిన తొమ్మిది గ్యారెంటీలు నెరవేర్చలేదు. కాంగ్రెస్ బాకీ కార్డుతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అందోల్-జోగిపేట మున్సిపాలిటీల్లోని వార్డుల్లో ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ వైఫల్యాలు, మోసాలను ప్రజలకు వివరిస్తూ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాలని మద్దతు కోరుతున్నారు. బీఆర్ఎస్ బాకీ కార్డు ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని బీఆర్ఎస్ వైపు ప్రజలు మొగ్గుచూపుతున్నారని అందోల్-జోగిపేట ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.
25 నెలల పాలనలో కాంగ్రెస్ బాకీలు
పథకం : కాంగ్రెస్ బాకీ పడిన మొత్తం
రైతుభరోసా : రూ.1,12,000(4 ఎకరాలకు)
రుణమాఫీ : రూ.2 లక్షలు
వరిపంటకు రూ.500బోనస్ : రూ.50వేలు(ప్రతి ఎకరాకు, నాలుగు పంటలకు)
రైతుకూలీలకు రూ.12వేల ఉపాధి హామీ : రూ.24వేలు(ప్రతి కూలీకి)
నిరుద్యోగులకు : 2 లక్షల ఉద్యోగాలు, రూ.96వేల నిరుద్యోగభృతి (24నెలలకు)
విద్యాభరోసా కార్డు : రూ.5 లక్షలు
ఆటోకార్మికులకు ఏడాదికి రూ.12వేలు : రూ.24వేలు ప్రతికార్మికుడికి (రెండేళ్లకు)మహిళలకు నెలకు రూ.2500 రూ.62వేలు(ప్రతి మహిళకు-24నెలలుగా బాకీ)
కల్యాణలక్ష్మి , షాదీముబారక్ : తులం బంగారం బాకీ
విద్యార్థినులకు : స్కూటీ బాకీ
రూ.4వేల పింఛన్ వృద్ధులు, బీడీకార్మికులకు : రూ.50వేలు బాకీ (24నెలలకు)
దివ్యాంగులకు రూ.6వేల పింఛన్ : రూ.50వేలు బాకీ(24 నెలలకు)
కాలేజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ : రూ.8వేల కోట్లు బాకీ