మద్దూరు(ధూళిమిట్ట), అక్టోబర్12: జనగామ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని అధిష్టానం ప్రకటించడంతో బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ధూళిమిట్ట మండలానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త నాచగోని శ్రీనివాస్‌గౌడ్ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి బీఆర్ఎస్ టికెట్ వస్తే కొమురవెల్లి మల్లన్న స్వామికి తన తలనీలాలు సమర్పిస్తానని కొన్ని రోజుల క్రితం మొక్కుకున్నాడు.
ఈ క్రమంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డికి బీఆర్ఎస్ టికెట్ దక్కడంతో శ్రీనివాస్‌గౌడ్ గురువారం కొమురవెల్లి మల్లన్న స్వామికి తన తలనీలాలు సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నాడు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. కొమురవెల్లి మల్లన్న ఆశీస్సులతో పాటు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు పల్లా రాజేశ్వర్‌రెడ్డికి నిండుగా ఉన్నాయన్నారు. ఈ ఎన్నికలలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి జనగామ ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి కోసం తలనీలాలు సమర్పించిన శ్రీనివాస్‌గౌడ్‌ను పలువురు బీఆర్ఎస్ నాయకులు అభినందించారు.