అందోల్/ వట్పల్లి, జూలై 5: భూతగాదాలతో అన్నను హత్యచేసి ఆనవాళ్లు లేకుండా బావలు, అల్లుడితో కలిసి శవాన్ని పాతిపెట్టిన సంచలన సంఘటనకు సంబంధించి నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు జోగిపేట సీఐ అనిల్‌కుమార్ తెలిపారు. శనివారం వట్పల్లి ఎస్సై లవకుమార్‌తో కలిసి జోగిపేటలోని తన కార్యాలయంలో మీడియాకు వివరాలు వెల్లడించారు. వట్పల్లి మండలం పల్వట్లకు చెందిన మంగళి సాయిలు (53) భార్య నవరాణితో కలిసి జోగిపేటలో నివాసం ఉంటున్నాడు. సాయిలుకు తమ్ముడు మల్లేశంతో పాటు బావలు లింగయ్య, సురేశ్, అల్లుడు మహేశ్‌కు కొద్ది రోజులుగా భూతగాదాలు నడుస్తున్నాయి. ఇదే విషయంపై గ్రామంలో కొద్ది రోజులుగా పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టినా సమస్య పరిష్కారం కాలేదు.
దీంతో అన్నను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకుని గతనెల 18న బైక్‌పై జోగిపేటకు వస్తున్న సాయిలును తమ్ముడు మల్లేశ్, బావ సురేశ్ వెంబడించి అందోల్ మండలం తాలెల్మ శివారుల్లో పట్టుకున్నారు. పక్కనే ఉన్న డంపుయార్డు వద్దకు తీసుకువెళ్లి తీవ్రంగా కొట్టారు. అయినా సాయిలు కొన ఊపిరితో ఉండ డంతో.. మల్లేశం పల్వట్లలో ఉన్న మరో బావ లింగమయ్య, అల్లుడు మహేశ్‌కు ఫోన్‌చేసి ఇంట్లో ఉన్న ఇనుపరాడు తీసుకుని రావాలని చెప్పారు. వారు చెప్పగానే ఇద్దరు బైక్‌పై రాడు తీసుకుని తాలెల్మ డంపుయార్డు వద్దకు వెళ్లగా రాడ్డుతో తలపై కొట్టి చంపేశారు.
సాయిలు మృతిచెందినట్లు నిర్ధారించుకున్న తర్వాత మళ్లీ పల్వట్లకు వెళ్లి పార, గడ్డపార తీసుకువచ్చి శవాన్ని కొద్దిదూరంలో ఉన్న కాల్వలో పూడ్చిపెట్టారు. తన భర్త ఆచూకీ కనబడడంలేదని మృతుడి భార్య నవరాణి వట్పల్లి ఠాణాలో జూన్ 26న ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సాయిలు జూన్ నెల 18న ఇంటి నుంచి బయలుదేరి నారాయణఖేడ్ వెళ్లి విత్తనాలు కొనుగోలు చేశాడు. వాటిని వట్‌పల్లిలోని షాప్‌లో పెట్టి జోగిపేటకు బయలుదేరినట్లు పోలీసుల విచారణలో తేలింది. సాయిలు కనిపించకుండా పోయిన రోజునుంచి నిందితులు మల్లేశం, లింగయ్య, సురేశ్, మహేశ్ ఊరిలో కనిపించకుండాపోయారు.
వారి కదలికలపై నిఘాపెట్టిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, సాయిలును హత్యచేసి పూడ్చిపెట్టినట్లు అంగీకరించారు. శనివారం రెవెన్యూ అధికారులు, వైద్యులు, ఫోరెన్సిక్ బృందం తాలెల్మ శివారులో మృతదేహాన్ని బయటకు తీసి పంచనామా నిర్వహించి మృతేడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. వట్పల్లి ఎస్సై, సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించినట్లు సీఐ తెలిపారు.